ఎస్‌ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో?

29 Apr, 2021 16:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్ ఎన్నికలు సజావుగా, జాగ్రత్తగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. మద్యం షాపులు మూసివేయాలని ప్రభుత్వానికి సూచించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన హైకోర్టు విచారణకు ఎస్‌ఈసీ కార్యదర్శి హాజరయ్యారు. ఈ మేరకు మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు పలు సూచనలు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరంగా ఉందని హైకోర్టు పేర్కొంది. ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదని  కరోనా విపత్తులో ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరమని విచారం వ్యక్తం చేసింది.

ఎన్నికల విధుల్లో 2557 మంది పోలీసులు సహా 7695 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని ఎస్‌ఈసీ తెలపగా.. ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికల నిర్వహిస్తున్నారని హైకోర్టు తెలిపింది. గతంలో హైదరాబాద్‌ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా అని ధర్మాసనం గుర్తు చేసింది. ఉద్యోగులు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారని వ్యాఖ్యానించింది. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఎస్‌ఈసీ దృష్టి ఎన్నికలపై ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్‌ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో? అని మండిపడింది.  ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది.

చదవండి: ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాలా?: తెలంగాణ హైకోర్టు

మరిన్ని వార్తలు