సీబీఐ దర్యాప్తు అవసరం లేదు: హైకోర్టు

16 Mar, 2021 18:45 IST|Sakshi

వామన్‌రావు దంపతుల హత్య కేసులో హైకోర్టు స్పష్టం

పోలీసుల దర్యాప్తు సరైన మార్గంలోనే సాగుతోందని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌:  వామన్‌రావు దంపతుల హత్య కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. పోలీసుల దర్యాప్తు సరైన దారిలోనే సాగుతోందని, తాము స్వయంగా పర్యవేక్షిస్తున్నామని స్పష్టం చేసింది. సీబీఐకి అప్పగించడం ద్వారా జాప్యం జరిగే అవకాశముందని పేర్కొంది. ఇక వామన్‌రావు, నాగమణిల హత్య జరిగిన సమయంలో.. అక్కడున్న మూడు ఆర్టీసీ బస్సుల జనంలో ఐదుగురిని మాత్రమే సాక్షులుగా గుర్తించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎక్కువ మంది వాంగ్మూలాలు తీసుకుని, సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. 

ఎక్కువ సాక్ష్యాలు నమోదు చేయాలి 
వామన్‌రావు దంపతుల దారుణహత్యపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా విచారణకు చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. హత్య కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ల వాంగ్మూ లాలను సీఆర్‌పీసీ సెక్షన్‌ 164 కింద న్యాయమూర్తి ఎదుట రికార్డు చేశామని.. బిట్టు శ్రీను, లచ్చయ్యల వాంగ్మూలాల నమోదు కోనం అనుమతి కోరామని ధర్మాసనానికి వివరించారు. మొత్తం 25 మంది సాక్షుల్లో 19 మంది వాంగ్మూలాలు నమోదు చేశామన్నారు. హత్య జరిగిన సమయంలో మూడు ఆర్టీసీ బస్సులు ఉన్నాయని.. ఆ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లతోపాటు ఐదుగురిని సాక్షులుగా గుర్తించా మని వివరించారు.

దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘పట్టపగలు నడిరోడ్డు మీద ట్రాఫిక్‌ను ఆపి వందల మంది ముందు దారుణంగా న్యాయవాద దంపతులను హత్య చేశారు. వారికి కఠిన శిక్ష పడాల్సిన అవసరముంది. అసలు ఆ 3 బస్సుల్లో ఎందరు ప్రయాణిస్తున్నారు, అందులో ఐదుగురినే సాక్షులుగా గుర్తించడం ఏమిటి?’అని ప్రశ్నించింది. దీనికి ఏజీ వివరణ ఇస్తూ.. సాక్ష్యం ఇచ్చేందుకు ముందుకొచ్చిన వారి వాంగ్మూలాలు నమోదు చేశామని, కేసును రుజువు చేసేందుకు ఏమేరకు అవసరమనే లెక్కన అధికారులు దర్యాప్తు చేస్తున్నా రని చెప్పారు. అయితే కీలక కేసుల ను నిరూపించేందుకు ఎక్కువ సాక్షులను గుర్తించాల్సిన అవసరముందని కోర్టు పేర్కొంది. ఇక ఈ కేసులో నిందితులందరి సెల్‌ఫోన్లు సీజ్‌ చేశామని, రహదారి వెంట ఉన్న సీసీ కెమెరాల హార్డ్‌డిస్క్‌లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని.. నివేదిక రాగానే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ వేస్తామని ఏజీ వివరించారు. 

అలా చేస్తే జాప్యం జరుగుతుంది 
న్యాయవాద దంపతుల హత్య కలచివేసిందని, బాధిత కుటుంబం ఆవేదనను అర్థం చేసుకోగలమ ని ధర్మాసనం పేర్కొంది. స్థానిక పోలీసుల దర్యాప్తుపై తాము సంతృప్తికరంగానే ఉన్నామని, ఈ దశ లో దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా జా ప్యం జరిగే అవకాశముందంది. ఈ మేరకు వామన్‌రావు తండ్రి కిషన్‌రావు వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ‘ఇప్పటివరకు దర్యాప్తు సరైన మార్గంలోనే సాగుతోంది.  ఈ దశలో దర్యాప్తును సీబీఐకి అప్పగించడం ద్వారా చార్జిïÙట్‌ దాఖలులో జాప్యం జరిగే అవకాశం ఉంది’ అని ధర్మాసనం పేర్కొంది.   

చదవండి: లాయర్ల హత్య కేసు: మధ్యంతర నివేదిక సిద్ధం!

మరిన్ని వార్తలు