డెంగీతో ‘జ్వర’భద్రం!

12 Jun, 2022 01:57 IST|Sakshi

రాష్ట్రంలో ఇంకా వర్షాలు కురవక ముందే డెంగీ కేసుల విజృంభణ

ఈ ఏడాది ఇప్పటివరకు 506 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ

హైదరాబాద్‌లో అత్యధికంగా 167 కేసులు నమోదు

దోమల నివారణతో జ్వరాలను కట్టడి చేయొచ్చంటున్న వైద్యులు  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో డెంగీ దడ పుట్టిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగు తున్న సమయంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్‌ మొదలైనా ఇంకా వర్షాలు కురవకముందే డెంగీ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 506 డెంగీ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

సాధారణంగా వానాకాలం ముగుస్తున్న సమయంలో డెంగీ తీవ్రత కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెంగీ కేసులు నమోదు కావడం, దీనికితోడు చికెన్‌ గున్యా బాధితులు సైతం క్రమంగా పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

పక్షం రోజుల్లో మారిన సీను...
రాష్ట్రంలో గత రెండు వారాలుగా డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో డెంగీ ప్రభావం కనిపించనప్పటికీ... ప్రస్తుతం రోజుకు సగటున 10–15 పాజిటివ్‌ కేసులు నమోద వుతున్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 167 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో 42, కరీంనగర్‌ జిల్లాలో 39 కేసులున్నాయి.

వరంగల్, సంగా రెడ్డి, రంగారెడ్డి, పెద్దపల్లి, నల్లగొండ, మేడ్చ ల్, మహబుబాబాద్, కొత్తగుడెం, ఖమ్మం, గద్వాల జిల్లాల్లో రెండంకెల సంఖ్యలో డెంగీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే డెంగీని సమర్థంగా ఎదుర్కోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

పగటిపూట దోమకాటే డేంజర్‌...
డెంగీ జ్వరం ఎడిస్‌ దోమ కాటుతో వస్తుంది. ఎడిస్‌ దోమ నీరు నిల్వ ఉండే చోట ఉంటుంది. ప్రధానంగా పగటిపూటే కుడుతుంది. ఈ దోమకాటుకు గురైన తర్వాత 103–104 డిగ్రీల మధ్య జ్వరం వస్తుంది. రోగికి జ్వరం తగ్గాక క్రమంగా ప్లేట్‌లెట్లు తగ్గుతాయి. జ్వరం తగ్గిందని ప్లేట్‌లెట్ల పరీక్ష చేయిం చుకోకపోతే డెంగీ దొంగదెబ్బ తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షల మధ్య ప్లేట్‌లెట్ల సంఖ్య ఉండాల్సి ఉండగా లక్షన్నరకన్నా దిగు వకు ప్లేట్‌లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుం టుంది. దీన్ని సకాలంలో గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల సమక్షంలో చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ప్లేట్‌లెట్ల సంఖ్య 50 వేలకన్నా పడిపోతుంటే తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగీ లక్షణాలు, చికిత్స
►ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి, కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్లనొప్పులు, అధిక దాహం, బీపీ తగ్గుదల.

►ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌తోపాటు తప్పనిసరిగా ఐజీఎం పరీక్ష చేయించాలి.

►డెంగీ జ్వరాన్ని గుర్తిస్తే వెంటనేవైద్యుని సలహా తీసుకోవాలి.

►ప్లేట్‌లెట్లు 50 వేలలోపు పడిపోతే దాన్ని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించాలి.

►జ్వరం తీవ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడవాలి.

►రోగికి ఎలక్ట్రాల్‌ పౌడర్, పండ్ల రసాలు ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్‌లెట్లు మళ్లీ పెరుగుతాయి. 

మరిన్ని వార్తలు