తెలంగాణలో కరోనా డేంజర్‌ బెల్స్‌.. ఆరోగ‍్యశాఖ హెచ్చరిక

22 Jun, 2022 00:35 IST|Sakshi

మూడున్నర నెలల తర్వాత ఈ స్థాయిలో ఇదే మొదటిసారి

ఆసుపత్రుల్లో తాజాగా 24 మంది చేరిక

కోవిడ్‌ జాగ్రత్తలు పాటించాలి

ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు వారాలుగా కేసుల్లో పెరుగుదల కనిపించగా, మంగళవారం మాత్రం ఏకంగా 400 మార్కును దాటాయి. ఒక్కరోజులో 26,704 మందికి కరోనా పరీక్షలు చేయగా, 403 మంది వైరస్‌ బారిన పడ్డట్టు తేలింది. అందులో హైదరాబాద్‌లో 240, రంగారెడ్డి జిల్లాలో 103 మంది ఉన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు ఏకంగా 1.5 శాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మూడున్నర నెలల తర్వాత ఇంతటిస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయన కరోనా బులెటిన్‌ విడుదల చేశారు. కాగా, ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 7.96 లక్షలకు చేరింది. ఒక్కరోజులో 145 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7.90 లక్షల మంది కోలుకున్నారు. 2,375 క్రియాశీలక కేసులు ఉన్నాయి. 24 మంది ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చేరారు. అందులో 12 మంది సాధారణ పడకలపై, ఏడుగురు ఆక్సిజన్‌పై, ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 

జాగ్రత్తలు తప్పనిసరి..
సీజనల్‌ వ్యాధులు కూడా పెరుగుతుండటంతో జాగ్రత్తలు పాటించాలని, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్‌ వాడటం తప్పనిసరి అని శ్రీనివాసరావు పేర్కొన్నారు. పదిహేను రోజుల నుంచి దేశంలో, తెలంగాణలో కోవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయని చెప్పారు. కోవిడ్‌ కేసుల పెరుగుదలలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

రెండు డోస్‌ల టీకా వెంటనే తీసుకోవాలని, పదేళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు దాటినవారు అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు. కోవిడ్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న 20– 50 ఏళ్ల మధ్య వయసువారు బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, కేన్సర్, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కోవిడ్‌కు గురికాకుండా చూసుకోవాలని, వైద్యం కోసం తప్ప ఎలాంటి ప్రయాణాలు చేయొద్దని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు