మంత్రి హరీశ్‌ ఔదార్యం  

17 Apr, 2022 03:33 IST|Sakshi
షేక్‌ షబ్బీర్‌భార్య, కుమారుడు, కుమార్తెతో హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్‌ సీట్లు సాధించినా.. రుసుము కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చేయూత అందించారు. ములుగు జిల్లాకు చెందిన షేక్‌ షబ్బీర్‌ తన ఇద్దరు పిల్లలు వైద్యులు కావాలని తపించారు. కానీ గత ఏడాది కరోనాతో ఆయన మరణించారు. అయినా పిల్లలు షేక్‌ షోయబ్, సానియా ఆత్మ విశ్వాసంతో తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కష్టపడి ఎంబీబీఎస్‌ సీట్లు సాధించారు.

సానియాకు కాకతీయ మెడికల్‌ కాలేజీలో, షోయబ్‌కు రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలో సీట్లు వచ్చాయి. కానీ పిల్లలిద్దరినీ చదివించే స్తోమత లేకపోవడంతో తల్లి జహీరాబేగం దాతలను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

అన్నా చెల్లెళ్ల వైద్య విద్య కొనసాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో జహీరా బేగం, ఆమె ఇద్దరు పిల్లలు శనివారం హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టుదలతో సీట్లు సాధించినందుకు అభినందిస్తూ.. మంచి వైద్యులై పేదలకు సేవ చేయాలని షోయబ్, సానియాలకు సూచించారు.

మరిన్ని వార్తలు