Monkeypox Virus: ‘మంకీపాక్స్‌’ కలకలంపై వైద్యాధికారుల స్పందన

25 Jul, 2022 11:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ కామారెడ్డి:  మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తిలో వెలుగుచూసిన వ్యవహారం.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నెల మొదటి వారంలో కువైట్‌ నుంచి కామారెడ్డి ఇందిరానగర్ కాలనీకి చేరుకున్నాడు 35 ఏళ్ల వ్యక్తి. తీవ్ర జ్వరం అటుపై అతనిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో వైద్య శాఖ అప్రమత్తం అయ్యింది. అదనపు టెస్టుల కోసం హైదరాబాద్‌ ఫీవర్‌ ఆస్పత్రికి తరలించగా..  ఇందుకు సంబంధించిన వివరాలను వైద్యాధికారులు వెల్లడించారు. 

మంకీపాక్స్‌ అనుమానితుడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఫీవర్‌ హాస్సిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ వెల్లడించారు. ‘‘అనుమానితుడి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచాం.  పేషెంట్‌లో నుంచి ఐదు రకాల శాంపిల్స్‌ తీసుకుని పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రేపు సాయంత్రం లోగా రిపోర్ట్‌ వస్తుందని భావిస్తున్నాం’’ ఆయన వెల్లడించారు. గట్టిగా దగ్గినప్పుడు తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు.

అంతేకాదు మంకీపాక్స్‌ లక్షణాలున్న వ్యక్తితో సన్నిహిత సంబంధాలు ఉన్న మరో ఆరుగురిని సైతం హోం ఐసోలేషన్ లో ఉంచినట్టు వెల్లడించిన ఆర్ఎంవో శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన జ్వరంతో వైద్యులను సంప్రదించగా.. 23 న మంకీపాక్స్ గా అనుమానం వచ్చింది. దీంతో హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు వైద్యులు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

ఇదిలా ఉంటే.. దేశంలో ఇప్పటిదాకా నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అందులో మూడు కేరళ నుంచి.. మరొకటి ఢిల్లీ నుంచి నమోదు అయ్యాయి. ఇక తెలంగాణాలో మంకీపాక్స్ కేసు లక్షణాలు రావడంతో కాస్త ఆందోళన మొదలైంది. అయితే వైద్యులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: మంకీపాక్స్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మరిన్ని వార్తలు