హైదరాబాద్‌లో భారీ వర్షం: దంచికొట్టి.. ముంచెత్తి.. 

26 Sep, 2021 02:39 IST|Sakshi
బంజారాహిల్స్‌లో...

నగరంలో భారీ వర్షం.. పలు ప్రాంతాలు జలమయం 

ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌.. పలుచోట్ల అంధకారం  

సాక్షి, హైదరాబాద్‌: నగరాన్ని శనివారం రాత్రి భారీ వర్షం ముంచెత్తింది. రాత్రి 8 గంటల సమయంలో కుండపోత వర్షం మొదలైంది. అర్ధరాత్రి వరకు కుండపోతగా పడుతూనే ఉంది. పలుచోట్ల ట్రాఫిక్‌ స్తంభించింది. రాగల మూడు రోజులు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలను కోరింది. నగరంలోని ఎల్బీనగర్, మణికొండ, షేక్‌పేట, శేరిలింగంపల్లి, మాదాపూర్, ఆసిఫ్‌నగర్, బాలనగర్, రాంనగర్, ముషీరాబాద్, విద్యానగర్, అంబర్‌పేట్, తార్నాక, అత్తాపూర్, కార్వాన్, బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.


నగరంలోని నల్లగొండ చౌరస్తాలో వర్షం నీటిలో మునిగిన కార్లు

మణికొండ (8.8 సెం.మీ.), ఉప్పల్‌ (4.4 సెం.మీ.), ఎల్‌బీనగర్‌ (4.7 సెం.మీ.) ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కురిసిన ఎడతెగని వర్షంతో ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట,  మహేశ్వరం పరిధిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.


ముసారాంబాగ్‌లో... 

కాలనీలు, బస్తీల్లోని డ్రైనేజీలు పొంగి వరదతో కలిసి మురుగునీరు రహదారులపై ప్రవహించింది. ఈ ప్రాంతాల పరిధిలోని పలు కాలనీలు నీటమునిగాయి. బంజారాహిల్స్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షంతో వాహనదారులు నరకాన్ని చవిచూశారు. 

మరిన్ని వార్తలు