తెలంగాణ జడ్జీల స్థానంలో ఆంధ్రా జడ్జీలు? 

14 Apr, 2022 10:10 IST|Sakshi
హైకోర్టు వద్ద బుధవారం ఆందోళన చేస్తున్న తెలంగాణ న్యాయవాదులు

పలువురు రాష్ట్ర న్యాయమూర్తుల బదిలీకి రంగం సిద్ధం

అడ్డుకుంటామన్న న్యాయవాదులు.. హైకోర్టు ఎదుట ఆందోళన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టులో తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంలో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇప్పటికే ఈ విషయంలో రంగం సిద్ధమైందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ న్యాయవాదులు. ముగ్గురు తెలంగాణ న్యాయమూర్తులను ఇప్పటికే బదిలీ చేశారని, త్వరలో మరికొందరిని బదిలీ చేసేందుకు సర్వం సిద్ధమైందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా రెండు వర్గాలకు చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని బదిలీలు చేపట్టబోతున్నారని గట్టిగా నమ్ముతున్నారు. ఈ బదిలీ యత్నాల వెనుక ఇటీవల తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన ఓ న్యాయమూర్తి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వారు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హైకోర్టులో సర్వం తానై వ్యవహరిస్తున్న ఆ న్యాయమూర్తి ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడిని వాడుతున్నట్టు చెబుతున్నారు. ఆ న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన నాటి నుంచి జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ ప్రధానమంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి, కేంద్ర హోం మంత్రి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరికీ తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ బుధవారం ఓ లేఖను పంపింది. 

ఊరుకునేది లేదు
రాష్ట్ర న్యాయమూర్తులను బలి పశువులను చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని తెలంగాణ న్యాయవాదులు చెబుతున్నారు. ఇందుకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సైతం సిద్ధమంటున్నారు. ఇందులో భాగంగానే న్యాయవాదులు బుధవారం హైకోర్టులో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాదులు, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కూడా పాల్గొనడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. బుధవారం భోజన విరామ సమయంలో హైకోర్టు గేటు ముందు ‘సేవ్‌ తెలంగాణ జ్యడీషియరీ, ఆంధ్ర న్యాయమూర్తులను తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయడం ఆపాలి’.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి వారి స్థానంతో ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విషయం తమ దృష్టికి వచ్చిందని బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు రాజేందర్‌రెడ్డి చెప్పారు. ఇలా చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని, రాష్ట్ర న్యాయవ్యవస్థ అస్థిత్వాన్ని ప్రశ్నించడమేనని మరో న్యాయవాది చిన్నోళ్ల నరేశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ న్యాయమూర్తులను బదిలీ చేసి ఆంధ్ర న్యాయమూర్తులను తీసుకురావాలన్న ప్రయత్నాలను విరమించుకోకపోతే ఆందోళనలు ఉద్యమ రూపం దాలుస్తాయని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి, న్యాయవాదులు గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, చిక్కుడు ప్రభాకర్, ఎ. జగన్, రాజేశ్‌ మెహతా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు