హైడ్రామా మధ్య హనుమకొండ బీజేపీ సభ!

27 Aug, 2022 01:34 IST|Sakshi

అటు బండి సంజయ్‌ పాదయాత్రపైనా ఇదే స్థితి 

సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వ అప్పీలు 

లంచ్‌ మోషన్‌లో విచారణకు స్వీకరించినా సోమవారానికి వాయిదా..

ఆగిన చోటే తిరిగి మొదలైన సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్ర 

జనగామ జిల్లా పాంనూరులో  టీఆర్‌ఎస్‌ కార్యకర్తల నిరసన.. 

తొలిసారిగా రాష్ట్రానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి సునీల్‌ బన్సల్‌

మొదట సభకు అనుమతి.. ఆ తర్వాత రద్దు.. హైకోర్టు అనుమతితో ఊరట

సాక్షి, హైదరాబాద్‌: ఆంక్షలు, అరెస్టులు, అనుమతుల గందరగోళం మధ్య.. హైకోర్టు జోక్యంతో శనివారం (27వ తేదీన) హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. మునుగోడు ఉపఎన్నిక, రాజాసింగ్‌ వివాదాస్పద వ్యా ఖ్యల పరిణామాలతో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం హనుమకొండలో జరగాల్సిన బీజేపీ సభకు తొలుత కాలేజీ ప్రిన్సిపాల్, పోలీసులు అనుమతినివ్వడం, తర్వాత రద్దు చేయడంపై.. ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు.

కోర్టు పలు ఆంక్షలతో సభకు అనుమతిచ్చింది. బీజేపీ నేత జేపీ నడ్డా ఈ సభలో పాల్గొననున్నారు. మరోవైపు హైకోర్టు అనుమతితో బండి సంజయ్‌ పాదయాత్ర యధావిధిగా కొనసాగింది. జనగామ జిల్లా పాంనూరు వద్ద టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు యాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇదంతా కేసీఆర్‌ పనేనని.. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఆయన కుమార్తె ప్రమేయం ఉన్న విషయం ప్రజల్లోకి వెళ్లకుండా యాత్రను అడ్డుకుంటూ బండి సంజయ్‌ ఆరోపించారు. బండి సంజయ్‌ యాత్ర, బీజేపీ సభ రెండూ శనివారం పూర్తికానున్నాయి.  
 

మరిన్ని వార్తలు