కేంద్రం అనుమతి తీసుకోవాలి

18 Feb, 2022 03:22 IST|Sakshi

‘బైసన్‌ పోలో’పై విచారణ ముగింపు 

సాక్షి, హైదరాబాద్‌: రక్షణ శాఖకు చెందిన భూముల్లో కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే నిర్మాణాలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. ముందస్తు అనుమతులు లేకుండా వాటి జోలికి వెళ్లడానికి వీల్లేదని, నిర్మాణాలు చేపట్టరాదని తేల్చిచెప్పింది. సికింద్రాబాద్‌ బైసన్‌ పోలో, జింఖానా మైదానంలో సచివాలయం, ఇతర నిర్మాణాలను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ మాజీ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావుతో పాటు మరికొందరు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. అయితే ప్రస్తుతం సచివాలయం ఉన్న ప్రాంతంలోనే నూతన సచివాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, బైసన్‌ పోలో, జింఖానా మైదానంలో నిర్మాణాలు చేపట్టాలన్న ప్రతిపాదనను ఉపసంహరించు కుందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. దీంతో ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణను ముగించింది.

హైకోర్టు భవనాలకు మాత్రం నిధుల్లేవా?
‘సచివాలయం నిర్మాణానికి నిధులుంటాయి. హైకోర్టులో అదనపు భవనాల నిర్మాణానికి మాత్రం నిధులు లేవా? నూతనంగా వస్తున్న న్యాయమూ ర్తులకు కోర్టు హాళ్లు, చాంబర్లు లేవు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏజీ, బార్‌ కౌన్సిల్‌ కార్యాలయాలను కూడా ఖాళీ చేయించాల్సి ఉంటుంది..’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు సమీపంలో 100 ఎకరాల భూమి కేటాయించిందని, అయితే అక్కడ నిర్మాణాలకు హైకోర్టు సుముఖంగా లేదని ప్రభుత్వ న్యాయవాది వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు