మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలి 

7 Aug, 2022 01:28 IST|Sakshi

లేదా వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డీహెచ్, డీఎంఈ నేరుగా హాజరుకావాలి 

లిక్కర్‌ డీ ఎడిక్షన్‌ కేంద్రాల ఏర్పాటుపై హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: లిక్కర్‌ డీ ఎడిక్షన్‌ (మద్యానికి బానిసైన వారిని ఆ అలవాటు మాన్పించేలా చికిత్స ఇచ్చే) కేంద్రాల ఏర్పాటుపై మూడు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. లేని పక్షంలో తదుపరి వాయిదాకు వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌(డీహెచ్‌), డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ)లు నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్‌ డీ ఎడిక్షన్, లిక్కర్‌ డీ ఎడిక్షన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని జీవోలో ఉన్నా.. ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వొకేట్, సామాజిక కార్యకర్త మామిడి వేణుమాధవ్‌ హైకోర్టులో 2016లో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

వేణుమాధవ్‌ వాదనలు వినిపిస్తూ.. డీ ఎడిక్షన్‌ కేంద్రాలను జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2013లో జీవో ఇచ్చిందన్నారు. పిటిషన్‌ దాఖలు చేసి ఆరేళ్లవుతున్నా ప్రతివాదులు ఇప్పటివరకు కౌంటర్‌ దాఖలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. 3 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.   

>
మరిన్ని వార్తలు