TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా?

14 Sep, 2021 01:36 IST|Sakshi

మా ఆదేశాలను సవరించడం కుదరదు: హైకోర్టు

అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకోండి

66 ఏళ్లయినా ‘కాలుష్య’చట్టాన్ని అమలు చేయరా?

జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం

దేవుడు పెట్టమన్నాడా...
తనకు భారీ విగ్రహాలు పెట్టాలని, అవి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసినవే ఉండాలని వినాయకుడు కోరుకోడు. దేవుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని పురాణాల్లో ఎక్కడా పేర్కొనలేదు. జీహెచ్‌ఎంసీ చట్టంలోనే జల కాలుష్యం జరగకుండా చూడాలని ఉంది. ఈ చట్టం వచ్చి 66 ఏళ్లు అయ్యింది. అయినా ఇప్పటికీ విగ్రహాల నిమజ్జనం పేరుతో కాలుష్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం ట్యాంక్‌ బండ్‌ వైపు చేపట్టరాదని, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌తో పాటు ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఈ ఉత్త ర్వులను సవరించాలంటూ జీహెచ్‌ఎంసీ వేసిన పిటిషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ వినోద్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం సోమవారం కొట్టేసింది. నిమజ్జనంపై ఆదేశా లను సవరించాలని జీహెచ్‌ఎంసీ తరఫున రివ్యూ పిటిషన్‌ వేసినట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్‌ నివేదించారు. ఇప్ప టికే ట్యాంక్‌బండ్‌పై భారీ క్రేన్‌ లను ఏర్పాటు చేశామని, బేబీ పాండ్స్‌లో భారీ విగ్రహాలను నిమజ్జనం చేయడం సాధ్యం కాదని తెలిపారు.

ఈ ఏడాదికి ట్యాంక్‌బండ్‌ వైపు నిమజ్జనానికి, అలాగే పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేసేందుకు అనుమతించాలని కోరారు. నిమజ్జనం పూర్తయిన 24 గంటల్లో వ్యర్థపదార్థాలను తొలగిస్తామని తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై అనుమతించకపోతే వేలాది విగ్రహాల నిమజ్జనానికి ఆరు రోజుల సమయం పడుతుందని, అలాగే నెక్లెస్‌రోడ్, ఇతర మార్గాల్లో ఇప్పటికిప్పుడు రబ్బర్‌ డ్యాం ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకొని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని అభ్యర్థించారు. గతంలో జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన మూడు కౌంటర్లలో ఎక్కడా బేబీ పాండ్స్‌లో నిమజ్జనానికి ఇబ్బందులు ఉన్నాయని పేర్కొనలేదని ధర్మాసనం అభ్యంతరం వ్యక్తంచేసింది. తాము ఆదేశాలు జారీచేసిన తర్వాత ఇప్పుడు పొంతన లేని కారణాలు చెబుతున్నారని మండిపడింది. 

2001లోనే స్పష్టమైన తీర్పు...
‘2001లో హైకోర్టు కాలుష్యాన్ని నియంత్రించాలని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. తర్వాత మరో ధర్మాసనం కూడా అదే తరహాలో తీర్పులో పేర్కొంది. 2020 జూన్‌లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పీవోపీ విగ్రహాలను నిషేధించాలని.. జల, శబ్ధ కాలుష్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ మార్గదర్శకాలు జారీచేసింది. దాదాపు ఏడాది ముందే సీపీసీబీ మార్గదర్శకాలు జారీచేసినా అమలు చేయకుండా ఇప్పుడు మినహాయింపులు కోరడం సరికాదు. జలాశయాలను కలుషితం చేస్తామంటే అనుమతించాలా? మేం చట్టాలను, హైకోర్టు తీర్పులను మాత్రమే అమలు చేయాలంటున్నాం. చట్టాలను ఉల్లంఘిస్తారా? అమలు చేస్తారా? అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. 

ఆ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు..
‘ట్యాంక్‌బండ్‌ వైపు ఇటీవల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే కొత్తగా వేసిన రెయిలింగ్, గార్డెన్స్, ఇతర లైటింగ్‌ దెబ్బతినే అవకాశం ఉంది. నిమజ్జనం ఉంటుందని తెలిసినా ఎందుకు అక్కడ అభివృద్ధి పనులు చేపట్టారు? ఇప్పుడు నిమజ్జనానికి అనుమతిస్తే అవన్నీ దెబ్బతిని తిరిగి నిర్మించాలి. మనం చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వం ఈ పనులు చేపట్టింది. ఈ డబ్బు వృథాకు ఎవరు బాధ్యులు’అని ధర్మాసనం జీహెచ్‌ఎంసీ తరఫున హాజరైన న్యాయవాదిని ప్రశ్నించింది. తమ ఆదేశాలను సవరించమని, అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసుకోవాలని స్పష్టం చేస్తూ జీహెచ్‌ఎంసీ రివ్యూ పిటిషన్‌ను కొట్టేసింది. 

హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు..
సాక్షి, హైదరాబాద్‌: ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో తయారైన వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దంటూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై సోమవారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. హైకోర్టు ఉత్తర్వులను సాధ్యమైనంత త్వరగా సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ వారిని ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు