TS High Court: నెలాఖరు వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ

14 Jul, 2021 02:39 IST|Sakshi

19 నుంచి పాక్షికంగా తెరుచుకోనున్న కింది కోర్టులు

ఆదిలాబాద్, నిజామాబాద్‌ కోర్టుల్లో నెలాఖరు దాకా ఆన్‌లైన్‌లోనే..

సాక్షి, హైదరాబాద్‌: కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారానే కేసులను హైకోర్టు విచారించనుంది. అయితే కింది కోర్టుల్లో ఆదిలాబాద్, నిజామాబాద్‌ల్లో మినహా ఇతర అన్ని జిల్లా కోర్టుల్లో మాత్రం కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ నెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఫుల్‌కోర్టు నిర్ణయించింది. ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రార్‌ జనరల్‌ వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో 50 శాతం ఉద్యోగులే దశలవారీగా విధులకు హాజరుకావాలని ఆదేశించగా ఈ నెల 19 నుంచి 100 శాతం ఉద్యోగులు విధులకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

మహారాష్ట్రతో సరిహద్దులు ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లోని కోర్టులు మాత్రం ఈ నెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విచారణ కొనసాగించాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లో ఈ నెల 19 నుంచి పాక్షికంగా విచారణ ప్రారంభించాలని ఆదేశించారు. గతేడాది మార్చి నెలాఖరు నుంచి హైకోర్టు న్యాయమూర్తులు ఆన్‌లైన్‌లోనే కేసులను విచారిస్తున్నారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టిన అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు కొందరు జడ్జీలు ఒక రోజు భౌతికంగా, మరోరోజు ఆన్‌లైన్‌లో కేసులను విచారించారు. మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో న్యాయమూర్తులంతా ఆన్‌లైన్‌ ద్వారానే కేసులను విచారిస్తున్నారు.  

మరిన్ని వార్తలు