హైకోర్టు తీర్పుతో తేలనున్న తెలంగాణ డీజీపీ భవితవ్యం.. ఏపీకి వెళ్లాల్సిందేనా?

20 Jan, 2023 08:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్‌ కొనసాగుతారా? లేక ఏపీకి వెళ్లాల్సి వస్తుందా అనేది నేడు తేలిపోనుంది. 2014లో ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూ ష్‌ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సర్వీస్‌ ఉద్యోగుల విభజనలో భాగంగా అంజనీకుమార్‌ను ఏపీకి కేటాయించారు. అయితే  కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించిన అంజనీకుమార్‌ తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు.  

గత నెలలో డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలను అంజనీకుమార్‌కు అప్పగించింది. బాధ్యతలు చేపట్టి ఇంకా నెలైనా పూర్తికాకముందే కేడర్‌ కేటాయింపులకు సంబంధించి తీర్పు రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సోమేశ్‌ కుమార్‌కు ఈనెల 10న హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించినందున అక్కడే వెళ్లి విధులు నిర్వహించాలని తేల్చిచెప్పింది.

దీంతో ఆయన సీఎస్‌ విధులకు రాజీనామా చేసి, ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. ఆయన ఏపీలో బాధ్యతలు చేపడ తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో నేడు వెలువడనున్న తీర్పు డీజీపీకి అనుకూలమా.. ప్రతికూలమా? అన్నది సందిగ్ధంగా మారింది. సోమేశ్‌లానే తీర్పు వెలువడితే అంజనీకుమార్‌ కూడా ఏపీకి వెళ్లాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఒక రాష్ట్రంలో కోర్టు తీర్పుల కారణంగా ఒకే నెలలో సీఎస్, డీజీపీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం దేశంలో ఇదే తొలిసారి అవుతుంది.

వీరిద్దరూ బిహార్‌ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. అంజనీకుమార్‌తోపాటు మరికొందరు ఆలిండియా కేడర్‌ సర్వీస్‌ అధికారులు కూడా క్యాట్‌ అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నేటి తీర్పుతో డీజీపీ అంజనికుమార్ సహా 12 మంది అధికారుల భవితవ్యం కూడా తేలిపోనుంది.  

మరిన్ని వార్తలు