ఆ భూమి సినీ పెద్దలదే..

18 Aug, 2022 00:40 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హక్కుల్లేవ్‌.. అప్పీల్‌ కొట్టివేత

ఖానామెట్‌లోని 26.16 ఎకరాల భూ వివాదంలో హైకోర్టు ఉత్తర్వులు 

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ సర్వే నంబర్‌ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి సినీ పెద్దలదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదే అనేందుకు ఆధారాలను సర్కార్‌ చూపలేకపోయిందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది. ఖానామెట్‌లో నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.

సదరు భూమికి చెందిన హక్కుల వివాదంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం రిట్‌ అప్పీల్‌ను దాఖలు చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం విచారణ జరిపి బుధవారం ఉత్తర్వులిచ్చింది. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్‌ సంతకాలకు పొంతన లేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు అంతకుముందు వాదనలు వినిపించారు.

ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించిన ట్లుగా పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. 15 ఏళ్ల తర్వాత ప్రభు త్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్‌ ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరారు. సినీ ప్రముఖుల తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదనలు వినిపించారు. ఆ భూమిని తాము కొనుగోలు చేసినప్పుడు అధికారులెవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ చేయడం చెల్లదన్నారు.

వాదనలు విన్న ధర్మాసనం.. ఈ భూముల వ్యవహారంలో రాష్ట్ర సర్కార్‌ జోక్యం చేసుకోరాదని, అనుబంధ స్వేతార్‌ రద్దు చేసి భూముల స్వాధీనానికి ప్రయత్నించరాదన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో కలుగజేసుకోవడానికి నిరాకరించింది. ఆ భూమి ప్రభుత్వానిదే అనేందుకు ఆధారాలు చూపలేకపోయిందని తప్పుపట్టింది. సర్కార్‌ అప్పీల్‌ను కొట్టివేస్తున్నామని ఉత్తర్వులు ఇచ్చింది.

మరిన్ని వార్తలు