హేమంత్‌ హత్యకేసులో నిందితులకు బెయిల్‌ నిరాకరణ

12 Nov, 2022 03:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటీరియర్‌ డిజైనర్‌ హేమంత్‌ హత్య కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. చందానగర్‌కు చెందిన హేమంత్‌ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం వారిద్దరూ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో నివాసం ఉండేవారు. అయితే కూతురు తమ కులం కాని వాడిని ప్రేమ పెళ్లి చేసుకోవడంపై యువతి తండ్రి తీవ్ర కోపంతో ఉండేవాడు.

హేమంత్‌ను ఎలాగైనా అంతమొందించాలని అనుకునేవాడు. ఈ నేపథ్యంలో కిరాయి గూండాలు హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి.. 2020, సెప్టెంబర్‌ 24న సంగారెడ్డిలో దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 14 మందిని నిందితులుగా చేర్చడంతో పాటు వారిని అరెస్టు చేశారు. వీరిలో ఎరుకుల కృష్ణ, సోమయాల రాజు, బిచ్చు యాదవ్, మహ్మద్‌ పాషాలు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్‌ నాగార్జున్‌ విచారణ చేపట్టారు. హేమంత్‌ హత్యలో వీరు కూడా భాగస్వాములే అనేందుకు బలమైన ఆధారాలున్నాయని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. బెయిల్‌ మంజూరు చేస్తే దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశముందని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నలుగురి బెయిల్‌ పిటిషన్‌ను రద్దు చేశారు.  

మరిన్ని వార్తలు