ఏడాదైనా కౌంటర్‌ వేయరా?

20 Jan, 2021 08:46 IST|Sakshi

ఇదే చివరి అవకాశం... సర్కారుకు హైకోర్టు ఆదేశం

‘మున్సిపల్‌ రిజర్వేషన్ల’ పిటిషన్‌పై విచారణ వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఏడాది గడిచినా ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కౌంటర్‌ దాఖలుకు ఏడాది గడువు సరిపోలేదా అని ప్రశ్నించింది. మూడు నెలల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని బడంగ్‌పేట మున్సిపాలిటీ ఎన్నికకు సంబంధించి జనవరి 4న ప్రకటించిన రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ అదే ప్రాంతానికి చెందిన బండారి కొమరేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది.

ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడాది గడిచిందని, రిజర్వేషన్లు వచ్చే ఎన్నికల నాటికి మారుతాయని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ విచారణార్హం కాదని ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ సంజీవ్‌కుమార్‌ నివేదించారు. రెండు పర్యాయాలకు ఒకసారి రిజర్వేషన్లు మారుతాయని మున్సిపల్‌ శాఖ జారీచేసిన ఉత్తర్వుల్లో ఉందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారించాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం...ప్రతివాదులు మూడు నెలల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని, దానిపై రెండు నెలల్లో రిప్లై దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. 

ఓఎంసీ కేసు నుంచి నా పేరు తొలగించండి : శ్రీలక్ష్మి
సాక్షి, హైదరాబాద్‌: అక్రమ మైనింగ్‌ ఆరోపణలపై ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)పై సీబీఐ నమోదు చేసిన కేసులో తనను అక్రమంగా ఇరికించారని, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వై.శ్రీలక్ష్మి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మైనింగ్‌ లీజుల మంజూరులో నిబంధనలకు అనుగుణంగానే తాను వ్యవహరించానని తెలిపారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 25కు వాయిదా వేసింది. 
 

మరిన్ని వార్తలు