యజమాని ప్రయోజనాల కోసం పిల్‌ వేస్తారా? 

29 Aug, 2020 02:53 IST|Sakshi

పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం 

రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: యజమాని వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారంటూ ఓ పిటిషనర్‌పై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వేదిక చేసుకోవడాన్ని సహించమని స్పష్టం చేసింది. పిటిషనర్‌ దురుద్దేశంతో ఈ పిల్‌ దాఖలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.50 వేలు జరిమానా విధించింది. 2 వారాల్లో ఈ డబ్బును న్యాయవాదుల సంక్షేమ నిధిలో జమ చేయాలని, లేకపోతే కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డితో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయపురిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్‌బంక్‌తో ప్రాజెక్టుకు ప్రమాదమని, అందువల్ల బంక్‌ ఏర్పాటు చేయకుండా ఆదేశించాలంటూ అదే ప్రాంతానికి చెందిన బి.వెంకటేశ్వర్లు పిల్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం పిటిషనర్‌ ఏం చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా... సమీపంలోని మరో పెట్రోల్‌ బంక్‌లో ఉద్యోగని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. దీంతో ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పెట్రోల్‌ బంక్‌ యజమానే వెనకుండి ఈ పిల్‌ దాఖలు చేయించినట్లుగా ఉందని, ఇందులో ప్రజాప్రయోజనం లేదని, వ్యక్తిగత వ్యాపార ప్రయోజనం ఉందని మండిపడింది. డ్యాం నిర్మాణానికి ఎంత దూరంలో నూతన పెట్రోల్‌ బంక్‌ నిర్మిస్తున్నారో పిటిషన్‌లో పేర్కొనలేదని, ప్రమాదం ఏ రకంగా పొంచి ఉందో కూడా పేర్కొనలేదని అసహనం వ్యక్తం చేసింది. కనీసం జరిమానా మొత్తాన్ని తగ్గించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వేడుకున్నా అంగీకరించని ధర్మాసనం.. రూ. 50 వేలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తూ పిల్‌ కొట్టివేసింది. 

మరిన్ని వార్తలు