ఆరు నెలలైనా కౌంటర్‌ వేయరా?

4 Dec, 2021 02:10 IST|Sakshi

4 వారాల్లో వేయకపోతే వ్యక్తిగతంగా హాజరుకావాలి 

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌ అనంతగిరి హిల్స్‌ నుంచి హిమాయత్‌సాగర్‌ మీదుగా హుస్సేన్‌సాగర్‌ వరకు వర్షపునీరు ప్రవహించే కాలువలన్నీ కూల్చిన భవనాల వ్యర్థాలు, అక్రమ కట్టడాలతో నిండిపోయాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని లేకపోతే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వర్షం నీరు ప్రవహించే కాలువలన్నీ వ్యర్థపదార్థాలతో పూడుకుపోవడంతో పాటు, అక్రమ నిర్మాణాల వల్ల నీరు ప్రవహించే అవకాశం లేకుండా పోయిందని, కాల్వల్లో నీరు ప్రవహించేలా చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ న్యాయవాది పి.ఇంద్ర ప్రకాష్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. 

మరిన్ని వార్తలు