Telangana High Court: ఇంత బాధ్యతారాహిత్యమా?

16 Sep, 2021 04:30 IST|Sakshi

మూడోదశ పొంచి ఉన్నా మేల్కొనరా

రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

మీరు స్పందించకపోతే మేమే ఉత్తర్వులిస్తాం

22లోగా ప్రణాళికలు సమర్పించాలని ఆదేశం

1.79% ఒక్క ఆర్‌టీపీసీఆర్‌ రిపోర్టుల ప్రకారమే పాజిటివ్‌ కేసులు..

మూడో దశ పిల్లలపై ప్రభావం చూపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కళాశాలలు, బడులు తెరవడం, వినాయక నిమజ్జనంతో కరోనా కేసులు మరింత పెరిగే అవకాశముంది. అయినా ప్రభుత్వం ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం ఏంటి ? పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని ఇప్పటికైనా తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టండి. సర్కారు స్పందించకపోతే మేమే జోక్యం చేసుకొని తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.    – హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని హైకోర్టు పేర్కొంది. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల రిపోర్టుల ప్రకారం 1.79% పాజిటివ్‌ కేసులు వస్తున్నా కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనాలో ఇటీవల కేసుల సంఖ్య పెరిగి మళ్లీ లాక్‌డౌన్‌ విధించారని గుర్తు చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. విపత్తు నిర్వహణ చట్టం నిర్దేశించిన మేరకు జూలై 15న నిపుణుల కమిటీ సమావేశమైందని, మూడో దశ కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అనేక సిఫారసులు చేసిందని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు.

‘రెగ్యులర్‌గా ఫీవర్‌ సర్వే చేయాలి. సీరో సర్వైలెన్స్‌ చేపట్టాలి. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాలి. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ నిల్వలు పెంచాలి. ఆక్సిజన్‌ నిల్వ చేసే సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆక్సిజన్, ఐసీయూ పడకల సంఖ్య పెంచాలి. చిన్న పిల్లల చికిత్సలకు సంబంధించి తగిన ఏర్పాట్లు చేయాలి..’ అని కమిటీ సిఫారసు చేసినట్లు తెలి పారు. దీంతో ఆ సిఫారసు అమలుకు ఏం ప్రణాళి కలు రూపొందించారు? ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పేర్కొనలేదంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. 1.79 శాతం కేసులు అంటే అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య విభాగం సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు నివేదించగా.. కేవలం ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లోనే 1.79 శాతం కేసులు వస్తుండడాన్ని తీవ్రంగానే పరిగణించాలని ధర్మాసనం పేర్కొంది. ఈనెల 22లోగా ప్రణాళికలతో నివేదిక సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది. 
   

మరిన్ని వార్తలు