శిఖం భూములనెలా కేటాయించారు? 

21 Aug, 2020 02:31 IST|Sakshi

అధికారుల తప్పులకు మాజీ సైనికులు ఇబ్బందులు పడాలా? 

ప్రత్యామ్నాయ భూమిని వెంటనే అప్పగించండి: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: మాజీ సైనికులకు చెరువు శిఖం భూములను ఎలా కేటాయిస్తారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యానికి మాజీ సైనికులెందుకు ఇబ్బందులు పడాలని నిలదీసింది. దేశ సరిహద్దుల్లో సైనికులు లేకపోతే మనకు రక్షణ ఎక్కడుందంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మండిపడింది. తదుపరి విచారణలోగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాలని గురువారం ఆదేశిస్తూ విచారణను సెప్టెంబర్‌ 11కు వాయిదా వేసింది. మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణ రెడ్డికి వికారాబాద్‌ జిల్లా ధారూర్‌ మండలం కుమ్మర్‌పల్లి గ్రామ సమీపంలోని సర్వే నెంబర్‌ 55లో నాలుగు ఎకరాల భూమిని 2010 మే 12న కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పాస్‌ పుస్తకాన్ని ఇచ్చినా భూమిని మాత్రం అప్పగించలేదు. తనకు భూమిని అప్పగించాలని పలుమార్లు కోరినా స్పందించలేదు. అయితే భూమిని కేటాయించి మూడేళ్లయినా సాగు చేయడం లేదు కాబట్టి కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నామంటూ రెవెన్యూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాల్‌చేస్తూ లక్ష్మీనారాయణ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా రెవెన్యూ అధికారుల తీరును తప్పుబడుతూ వెంటనే భూమిని అప్పగించాలని 2017 డిసెంబర్‌లో ఆదేశించారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేసింది. లక్ష్మీనారాయణ రెడ్డికి కేటాయించినవి శిఖం భూములని, వాటిని అసైన్‌మెంట్‌ కింద ఇవ్వడానికి వీల్లేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. శిఖం భూములని తెలిసినా ఎలా కేటాయించారని, భూమిని అప్పగించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఐదేళ్లు ఎందుకు కాలయాపన చేశారని ధర్మాసనం ప్రశ్నించింది. శిఖం భూమిని అప్పగించే అవకాశం లేకపోతే వెంటనే ప్రత్యామ్నాయ భూమిని అప్పగించాలని, ఈ విషయాన్ని 11న తెలియజేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు