కోర్టు ధిక్కరణ కేసుల్లో.. తెలంగాణ హైకోర్టు వినూత్న తీర్పులు

19 Jul, 2021 10:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు సమాజ సేవ చేసేలా సామాజిక శిక్షలు విధిస్తూ హైకోర్టు వినూత్న తీర్పులు ఇస్తోంది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూనే సంబంధిత అధికారులను సమాజ సేవలో భాగస్వామ్యం చేస్తోంది. ఆయా అధికారులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, పదవీ విరమణ బెనిఫిట్స్‌ పొందడంలో ఇబ్బంది తలెత్తకుండా సామాజిక సేవ చేయాలనే షరతులతో అంతకుముందు వారికి విధించిన జరిమానా, జైలు శిక్షను రద్దు చేస్తోంది. వారి తప్పును తెలుసుకొని మళ్లీ కోర్టు ఆదేశాల అమలులో జాగరూకతతో వ్యవహరించేలా చేస్తోంది. ఇలాంటి సేవకు అధికారులు సైతం ఆనందంగా ముందుకొస్తున్నారు. ఈ ఆరు నెలల కాలంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పుల్లో కొన్ని.  

అనాథలకు బోధన చేయండి.. 
వరంగల్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా 2015లో విధులు నిర్వహించిన సమయం (ప్రస్తుతం నల్లగొండ జిల్లా కలెక్టర్‌)లో కోర్టు ఆదేశాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐఏఎస్‌ అధికారి ప్రశాంత్‌ జే.పాటిల్‌కు సింగిల్‌ జడ్జి రూ.2 వేలు జరిమానా విధించారు. కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి క్షమాపణ కోరుతూ పాటిల్‌ అప్పీల్‌ దాఖలు చేసుకున్నారు. ఈ అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. నల్లగొండ జిల్లాలో ని ఏదైనా ఒక అనాథ శరణాలయంలో ఆరు నెలలపాటు వారంలో 2 గంటలు చిన్నారులకు విద్యను బోధించాలనే షరతుతో సింగిల్‌ జడ్జి తీర్పును రద్దు చేసింది.  

ఆకతాయికి గాంధీలో పారిశుధ్య పనులు.. 
సామాజిక శిక్షలు విధించడం 2010లో జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ తీర్పులతో మొదలయ్యింది. రోడ్డుపై వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలంటూ సదరు యువకుడు హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్‌ మంజూరు చేస్తానని, అయితే గాంధీ లాంటి ఆస్పత్రిలో నెల రోజులపాటు కొన్ని గంటలు పారిశుధ్య పనుల్లో పాల్గొనాలని షరతు విధించారు.

భోజనం ఏర్పాటు చేయండి.. 
వరంగల్‌ జిల్లా జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో)గా పనిచేసి పదవీ విరమణ చేసిన సంధ్యారాణికి సర్వీసులో ఉన్న సమయంలో ఓ తీర్పు అమలులో జాప్యానికి సింగిల్‌ జడ్జి రూ.2 వేలు జరిమానా విధించారు. అయితే 2019లో తాను పదవీ విరమణ చేశానని, ప్రస్తుతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్నానని.. సింగిల్‌ జడ్జి తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని కోరుతూ సంధ్యారాణి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ను విచారించిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తామని, అనాథ శరణాలయంలో ఉండే వారికి ఉగాది, శ్రీరామనవమి పండులకు ఉచితంగా పంచభక్ష పరమాన్నాలతో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

20 మందికి వారంపాటు ఇఫ్తార్‌ ఇవ్వండి 
మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ సయ్యద్‌ యాసీన్‌ ఖురేషీ సింగిల్‌ జడ్జి ఆదేశాలను అమలు చేయడంలో కొంత జాప్యం చేశారు. దీంతో జడ్జి ఆయనకు రూ.వెయ్యి జరిమానా విధించారు. ఈ జరిమానాను ఆయన జీతం నుంచి వసూలు చేయాలని, అలాగే ఆయన సర్వీసు రికార్డులో శిక్షను నమోదు చేయాలని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఖురేషీ దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్‌ హిమకోహ్లీ ధర్మాసనం విచారించింది.

గతంలో ఎటువంటి కోర్టుధిక్కరణ కేసులు ఎదుర్కొలేదని, తీర్పు అమలులో జాప్యానికి భేషరతుగా క్షమాపణలు కోరుతున్నారని.. సింగిల్‌ జడ్జి తీర్పుతో ఆయనకు పదోన్నతుల్లో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం సింగిల్‌ జడ్జి విధించిన శిక్షను రద్దు చేస్తామని పేర్కొంది. అయితే ఈ కేసు విచారణ సమయంలో రంజాన్‌ మాసం ఉండటంతో.. ఖురేషీ తన ఇంటికి సమీపంలోని మసీదు దగ్గర ఉపవాస దీక్ష విరమించే వారికి వారం రోజులపాటు 20 మందికి తగ్గకుండా ఇఫ్తార్‌ ఇవ్వాలని షరతు విధించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు