గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిందే: టీఎస్‌పీస్సీని ఆదేశించిన హైకోర్టు

27 Sep, 2023 13:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ సమర్ధించింది. ప్రిలిమ్స్ రద్దును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.

కాగా జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను టీఎస్‌పీఎస్సీ ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఎస్‌పీఎస్సీ రూల్స్‌ పాటించలేదని, పరీక్షను సరిగా నిర్వహించలేకపోయిందని మండిపడింది. ఈ మేరక ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ప్రిలిమ్స్‌ను మళ్లీ నిర్వహించాలని తీర్పు వెల్లడించింది. ఈ సారి అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ తీసుకోవాలని తెలిపింది. 

ఇదిలా ఉండగా గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో ఆ పరీక్షను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దు అయ్యింది.
చదవండి: టెట్‌ ఫలితాలు విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి

మరిన్ని వార్తలు