సినీ పెద్దలకు ఆ భూమిపై హక్కుల్లేవు

14 Jul, 2022 13:59 IST|Sakshi

ఖానామెట్‌ భూ వివాదంలో హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ సర్వే నంబర్‌ 4, 5, 8, 9, 10, 12లోని 26.16 ఎకరాల భూమి వ్యవహారంలో పలువురు సినీ పెద్దలకు ఎలాంటి హక్కులు లేవని హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఖానామెట్‌లో చట్ట ప్రకారం హక్కులు లేని భూమిని నిర్మాత డి.రామానాయుడు, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, గోవిందరెడ్డి, ఇతరులు 26.16 ఎకరాలు కొనుగోలు చేశారని నివేదించింది.
చదవండి: వెసక్టమీ చేయించుకుంటే పురుషులు శక్తిహీనులవుతారా?

సదరు భూ హక్కుల వివాదంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎస్‌. నంద ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపించారు. మాజీ సైనికుడికి భూమి ఇచ్చిన పత్రాలపై సంతకాలకు అప్పటి తహసీల్దార్‌ సంతకాలకు పొంతన లేదన్నారు.

ఫోర్జరీ సంతకాలతో మాజీ సైనికుడికి కేటాయించినట్లు పత్రాలు సృష్టించారని, అతని నుంచి మరొక వ్యక్తి కొనుగోలు చేస్తే.. వారి నుంచి ప్రతివాదులు భూమిని కొనుగోలు చేశారన్నారు. సైన్యంలో జవాన్లకు 5 ఎకరాలు ఇవ్వాలన్నది ప్రభుత్వ నిబంధనని, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహనాయక్‌కు ఇది వర్తించదని చెప్పారు. తహసీల్దార్‌ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లుగా ఫోరెన్సిక్‌ శాఖ నిర్ధారించడంతో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకుందని వెల్లడించారు. 15 ఏళ్ల తర్వాత ప్రభుత్వం రికార్డులను సవరించడం చెల్లదని సింగిల్‌ జడ్జి తీర్పును కొట్టేయాలని కోరారు. రామానాయుడు, రాఘవేంద్రరావు ఇతరుల వాదనల నిమిత్తం విచారణను హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు