రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ?

11 Nov, 2020 12:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక అందిన దరఖాస్తులు పరిశీలించవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదా బైనామాల క్రమబద్ధీకరణకు సంబంధించి నిర్మల్ జిల్లాకు చెందిన రైతు షిండే వేసిన పిల్‌పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాక ముందు అందిన దరఖాస్తులు మాత్రమే పరిశీలించవచ్చని తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టం అక్టోబరు 29 నుంచి అమల్లోకి వచ్చిందన్న ఏజీ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. అక్టోబరు 10 నుంచి 29 వరకు 2,26,693 దరఖాస్తులు అందాయని వెల్లడించారు.

అక్టోబరు 29 నుంచి మంగళవారం వరకు 6,74,201 దరఖాస్తులు వచ్చాయని ఏజీ కోర్టు దృష్టి తీసుకువచ్చారు. ఈ క్రమంలో రద్దయిన చట్టం ప్రకారం ఎలా క్రమబద్ధీకరణ చేస్తారని హైకోర్టు ఏజీని  ప్రశ్నించింది. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుకు రెండు వారాల గడువు కావాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ హైకోర్టును కోరారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 6,74,201 దరఖాస్తులను కూడా పరిశీలించవద్దని హైకోర్టు ఆదేశించింది. 2,26,693 దరఖాస్తులపై నిర్ణయం కూడా తుది తీర్పునకు లోబడి ఉండాలన్న హైకోర్టు సూచించింది.

మరిన్ని వార్తలు