Poachgate: ఇంకెన్నాళ్లీ కేసు?

10 Jan, 2023 01:00 IST|Sakshi

ఎమ్మెల్యేలకు ఎర కేసుపై హైకోర్టు ధర్మాసనం

సీనియర్‌ న్యాయవాదులు చెప్పిన వివరాలే మళ్లీమళ్లీ చెప్పడం సరికాదు

ప్రజోపయోగ కేసులు వేరేవి కూడా ఉన్నాయంటూ అసహనం

సాక్షి, హైదరాబాద్‌: ‘ప్రజోపయోగ కేసులు వేరేవి కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నాళ్లు ఈ కేసునే కొన సాగిస్తాం. సీనియర్‌ న్యాయవాదులు.. చెప్పిన వివరాలనే మళ్లీ మళ్లీ చెప్పడం సరికాదు. ఒకే తీర్పును పలువురు.. పలుమార్లు ధర్మాసనం దృష్టికి తేవడం ద్వారా సమయం వృథా తప్ప ప్రయోజనం ఉండదు. ‘ఈ కేసును సీబీఐకి ఇవ్వొ ద్దు.. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను కొట్టి వేయాలి..’ అని ప్రభుత్వం దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌లో మాత్రమే వాదనలు వినిపించాలి.

ఇందుకు సంబంధించిన ఇతర పిటిషన్లపై ప్రస్తుతం వాదనలు వద్దు..’ అని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో సోమ వారం.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియ ర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, ప్రతివాదుల తర ఫు సీనియర్‌ న్యాయవాదులు ఉదయ హోల్లా, సంజయ్‌ వర్చువల్‌గా వాదనలు వినిపించారు.  

పబ్లిక్‌ డొమైన్‌లోకి ఎలా వచ్చాయి..
‘ఈ కేసులో పోలీసులే సాక్షులు. వాళ్లే విచారణ అధికారులు. వాళ్లే ఫిర్యాదుదారులు. భూసారపు శ్రీనివాస్‌.. 20 ఏళ్లుగా కరీంనగర్‌లో న్యాయ వాదిగా పనిచేస్తున్నారు. ఆయన ఇంటిపైకి 30 మంది పోలీసులు దండయాత్రలాగా వచ్చారు. 41ఏ నోటీసులను ఇంటికి అతికించారు. ఈ తతంగం అంతా మీడియాలో విస్తృతంగా ప్రసా రం అయింది. అసలు ఈ కేసులో శ్రీనివాస్‌ నిందితుడు కాదు.. సాక్షి కాదు.

ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు కూడా లేదు. కానీ సిట్‌ విచారణకు హాజర య్యారు. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్, ఆ పార్టీ ఇతర ముఖ్య నేతల పేర్లు చెప్పాలని తీవ్ర వేధింపులకు గురిచేశారు. చెప్పినట్లు వినకుంటే నిందితుల జాబితాలో పేరు చేరుస్తామని బెదిరించారు. దర్యాప్తు అంతా రాజకీయ కక్షపూరితంగా సాగుతోంది. ‘ఎర’కు సంబంధించి పబ్లిక్‌ డొమైన్‌లో ఉన్న వివరాలనే సీఎం చెప్పారని ప్రభుత్వ న్యాయవాది పేర్కొంటున్నారు.

పోలీ సులు రికార్డు చేసిన సీడీల్లో ఉన్న వివరాలు పబ్లిక్‌ డొమైన్‌లోకి ఎలా వచ్చాయి? ఎవరి వల్ల వచ్చాయి? అన్నది పోలీసులు స్పష్టం చేయాల్సి ఉంది. అత్యంత ప్రముఖులు ఈ కేసులో అంతర్భాగమై ఉన్నారు. కనుక సీబీఐకి అప్పగించడమే సరైన నిర్ణయం..’ అని ప్రతివాదుల (నిందితులు) తరఫు న్యాయవాదులు అన్నారు. 

సీబీఐకి బదిలీ చేసే అధికారం లేదు..
‘హైకోర్టులకు సంబంధించిన చట్ట ప్రకారం ఈ కేసులో అప్పీల్‌ను ద్వి సభ్య ధర్మాసనం ముందు వేయవచ్చు. సింగిల్‌ జడ్జి వద్ద నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తే ఇది సివిల్‌ నేచర్‌ ఉన్న కేసే అన్నది తెలుస్తుంది. ఆర్టికల్‌ 227 ప్రకారం.. ట్రిబ్యునళ్లు, హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ద్విసభ్య ధర్మాసనం వాద నలు వినవచ్చు. హైకోర్టుకు ఆ అధికారం ఉంది.

క్రిమినల్‌ విచారణ సాగినందున అప్పీల్‌పై విచా రణ జరిపే అధికారం ద్వి సభ్య ధర్మాసనా నికి లేదనడం సరికాదు. ముఖ్యమంత్రి ప్రెస్‌ మీట్‌ పెట్టి సీడీలు, వివరాలను మీడియాకు ఇవ్వ డం అనేది బాధిత ఎమ్మెల్యేల పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు ఉన్న హక్కు. దాన్ని సిట్‌ దర్యాప్తునకు లింక్‌ పెట్టి చూడటం తోసిపుచ్చాల్సిన విషయం. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ను గానీ, ట్రాప్‌నుగానీ నిందితులు సహా ఎవరూ ప్రశ్నించలేదు. అందువల్ల సీబీఐకి కేసు బదిలీ చేసే అధికారం హైకోర్టుకు లేదు..’ అని దవే వాదించారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు