‘మునుగోడు’ విచారణ నేటికి.. 

14 Oct, 2022 01:36 IST|Sakshi

ఓటర్‌ జాబితాపై నేడూ విచారించనున్న హైకోర్టు 

గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నకిలీ ఓట్లు చేరుస్తోంది: రచనారెడ్డి 

కొత్త ఓటర్ల నమోదు సర్వసాధారణం: అవినాశ్‌ దేశాయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓట్లు సృష్టించి లబ్ధి పొందాలని టీఆర్‌ఎస్‌ చూస్తోందని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌లో గురువారం హైకోర్టులో విచారణ సాగింది. సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల జాబితా, కొత్త దరఖాస్తులు, తిరస్కరించిన వాటి వివరాలతో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

అలాగే కొత్త ఓటర్ల నమోదుకు అనుసరించే విధానం చెప్పాలని స్పష్టం చేసింది. విచారణను నేటికి వాయిదా వేసింది. ఏడు నెలల కాలంలో 1,474 మంది మాత్రమే కొత్త ఓట్ల కోసం దరఖాస్తు చేసు కోగా, ఈ 6 నెలల్లో 24,781 దరఖాస్తు చేసుకోవడం వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందంటూ.. జూలై 31 నాటి జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే.

జూలై జాబితా మేరకే ఎన్నికలు జరపాలి.. 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి గురువారం వాదనలు వినిపిస్తూ.. మును గోడు ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ నకిలీ ఓట్లను చేర్పించిందన్నారు. రెండు నెలల్లో 24,781 కొత్త ఓట్ల నమోదు కావడా న్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించాలని కోరా రు. జూలై 31 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా మునుగోడు ఎన్నికలు నిర్వహణకు ఈసీకి ఆదేశాలివ్వాలని కోరారు. ఈ నెల 14న ఈసీ కొత్త ఓటర్ల లిస్ట్‌ ప్రకటించకముందే ఉత్తర్వులు ఇవ్వాలన్నారు.

ఫారం 6,7,8ల ద్వారా 24,781 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారని, వీటిని ఆమోదిస్తే రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకం అవుతుందని నివేదించారు. ఈసీ తరఫున న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల సమయంలో ఇలా కొత్త ఓటర్ల నమోదు జరగడం సర్వసాధారణమని చెప్పారు. కొత్త దరఖాస్తుల్లో 7 వేలను అధికారులు తిరస్కరించారన్నారు. ఈసీ యాక్ట్‌లోని సెక్షన్‌ 23(3) ప్రకారం నామినేషన్లు దాఖలు చేసే చిట్టచివరి రోజు వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉందన్నారు. దీని ప్రకారం మునుగోడులో ఈ నెల 14 వరకు ఓటర్ల నమోదుకు చాన్సుందని తెలిపారు.  

మరిన్ని వార్తలు