పువ్వాడకు హైకోర్టు నోటీసులు

23 Apr, 2022 04:25 IST|Sakshi

సాయిగణేశ్‌ ఆత్మహత్య ఘటనపై జారీ

కేంద్ర, రాష్ట్ర హోం శాఖ కార్యదర్శులకూ..

విచారణ ఈ నెల 29కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం పట్టణానికి చెందిన బీజేపీ కార్యకర్త ఎస్‌. సాయి గణేశ్‌ ఆత్మహత్య ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర, రాష్ట్ర హోంశాఖ కార్యదర్శులతోపాటు ఖమ్మం సీపీ, ఖమ్మం మూడవ పట్టణ ఎస్‌హెచ్‌వో, సీబీఐ డైరెక్టర్, టీఆర్‌ఎస్‌ నేత ప్రసన్న క్రిష్ణ, సీఐ సర్వయ్యలకూ నోటీసులిచ్చింది.

ఈ వ్యవహారంపై 7 రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. సాయిగణేశ్‌ ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతోపాటు బాధిత కుటుంబానికి పరిహారం ఇచ్చేలా ఆదేశించాలంటూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన న్యాయవాది కె. క్రిష్ణయ్య (గతంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ నేత) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావలిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం లంచ్‌ మోషన్‌ రూపంలో విచారించింది. 

సీబీఐ దర్యాప్తుతోనే వాస్తవాలు తెలుస్తాయి: పిటిషనర్‌
పోలీసుల వేధింపులతోనే సాయిగణేశ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అభినవ్‌ క్రిష్ణ నివేదించారు. మంత్రి ఆదేశాలతో పోలీసులు సాయిపై 10 కేసులు బనాయించారని, రౌడీషీట్‌ తెరిచారన్నారు. తన చావుకు మంత్రి కారణమంటూ గణేశ్‌ మరణ వాంగ్మూలం ఇచ్చినా పువ్వాడపై పోలీసులు కేసు నమోదు చేయలేదని గుర్తుచేశారు.

ఈ కేసును స్థానిక పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేయట్లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. ఈ ఘటన తర్వాత మృతుడి తల్లికి రూ.50 లక్షలు, కారు ఇస్తామని ప్రలోభపెడుతున్నారన్నారు. ఘటనపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌  నివేదించారు. కౌంటర్‌ దాఖలుకు గడువు కోరడంతో విచారణను కోర్టు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు