హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేశవరావు కన్నుమూత 

10 Aug, 2021 03:51 IST|Sakshi

అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు 

హబ్సిగూడ/రాయదుర్గం/సాక్షి,న్యూఢిల్లీ: కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పొట్లపల్లి కేశవరావు(60) గుండెపోటుతో సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కేశవరావు పార్థివదేహానికి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కోహ్లీ, న్యాయమూర్తులు జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి, లోకాయుక్త జస్టిస్‌ బీఎస్‌ రాములు, జస్టిస్‌ ఎంఎస్‌ రాంచందర్‌రావు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవీఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ గంగారావు, జస్టిస్‌ విజయలక్ష్మి నివాళులు అర్పించారు. జస్టిస్‌ కేశవరావు మృతితో హైకోర్టు, జిల్లాల్లోని అన్ని కోర్టులు, ట్రిబ్యునల్స్‌కు సోమవారం సెలవు ప్రకటించారు. 

నీతినిజాయితీలకు మారుపేరు.. 
జస్టిస్‌ కేశవరావు వరంగల్‌ జిల్లా పెండ్యాల గ్రామంలో 1961 మార్చి 29న జన్మించారు. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొం దారు. 1986లో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. అనంతరం కొంతకాలంపాటు వరంగల్‌లో న్యాయవాదిగా పనిచేసి 1991 నుంచి హైదరాబాద్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2010 నుంచి 2016 వరకు సీబీఐ కేసుల్లో వాదనలు వినిపించేందుకు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించారు. 2015లో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా, 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనేక సంచలన కేసులలో తీర్పులు ఇచ్చిన ఆయన.. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచారు.  

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంతాపం 
జస్టిస్‌ పి.కేశవరావు మృతిపట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సంతాపం వ్యక్తం చేశారు. ‘జస్టిస్‌ కేశవరావు మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా. ఆయన శ్రద్ధ, కరుణ కలిగిన న్యాయమూర్తి. 35 ఏళ్ల సుదీర్ఘ లీగల్‌ ప్రొఫెషన్‌లో విశేష సేవలందించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు 
అభిమానులు, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య జస్టిస్‌ కేశవరావు అంతిమయాత్ర నగరంలోని ఆయన ఇంటి నుంచి రాయదుర్గం వైకుంఠ మహాప్రస్థానం వరకు కొనసాగింది. అక్కడే అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన కుమారులు నిషాంతరావు, సిద్ధార్థరావు, తండ్రి ప్రకాశ్‌రావు, సోదరుడు నర్సింహారావు సమక్షంలో పోలీసులు గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించారు. అంత్యక్రియల్లో హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ శ్రీదేవి, జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్, జస్టిస్‌ నవీన్‌రావు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

గవర్నర్‌ దిగ్భ్రాంతి, సీఎం సంతాపం
జస్టిస్‌ పి.కేశవరావు అకాల మరణం పట్ల గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణంతో దేశం, ప్రత్యేకంగా తెలంగాణ గొప్ప న్యాయ కోవిదుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ పి.కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు