ఆ భూమి ప్రైవేటు వ్యక్తులదే: హైకోర్టు 

9 Feb, 2021 09:05 IST|Sakshi

ఆ సేల్‌ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయండి

నిర్లక్ష్యంపై సబ్‌రిజిస్ట్రార్‌కు రూ.50 వేలు జరిమానా

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట పరిధిలోని సర్వే నెంబర్‌ 78లో 8.07 ఎకరాలను ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. ఈ భూమి ప్రైవేట్‌దే అని 2014లో అప్పటి తహసీల్దార్‌ నిర్ధారించిన నేపథ్యంలో భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. క్రాఫ్ట్‌ అల్లాయ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ భూమిని మరో సంస్థ వేసిన వేలంలో కొనుగోలు చేసిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌ చేయాల్సిందేనని చెప్పింది. పట్టాదార్‌ పాస్‌ బుక్స్‌ను అడగకుండా సదరు ఫైనాన్స్‌ సంస్థ జారీచేసిన సేల్‌ సర్టిఫికెట్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని, వారం రోజుల్లో మ్యుటేషన్‌ ప్రక్రియనూ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఈ సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టడంతోపాటు గత ఏడాదిగా రిజిస్ట్రేషన్‌ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు తహసీల్దార్‌ కమ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌.. పిటిషనర్‌కు రూ.50 వేలు 4 వారాల్లో చెల్లించాలని తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఆశి రియల్టర్స్, నిహారిక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ హఫీజ్‌పేట్‌లోని 78 సర్వే నెంబర్‌ లోని 8.07 ఎకరాల భూమిని కుదవపెట్టి ఓ ప్రైవేటు సంస్థ నుంచి రూ.110 కోట్లు రుణం తీసుకుంది.

అయితే రుణం చెల్లించకపోవడంతో సదరు సంస్థ ఈ భూమిని చట్టబద్ధంగా కోర్టు అనుమతి తీసుకొని వేలం వేసింది. ఈ వేలంలో ఎక్కువ మొత్తం కోట్‌ చేసి క్రాఫ్ట్‌ అల్లాయ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ కొనుగోలు చేసింది. అయితే ఏడాదిగా ఆ సేల్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని సంబంధిత తహసిల్దార్‌ కమ్‌ సబ్‌రిజిస్ట్రార్‌ను కోరినా స్పందన లేదు. ఈ నేపథ్యంలో అల్లాయ్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. 

చదవండి3 నెలల నిరీక్షణ: నేడు హైకోర్టులో విచారణ

చదవండి: పిటిషనర్లకు షాకిచ్చిన హైకోర్టు.. రూ.10 వేల జరిమానా

మరిన్ని వార్తలు