ప్రజాప్రయోజనాల కోసమే భూసేకరణ: హైకోర్టు 

27 May, 2022 04:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) చట్టబద్ధమైన సంస్థ అని, ప్రజాప్రయోజనార్థం నిర్మించే రహదారుల కోసమే భూ సేకరణ చేపడుతోందని హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే ఆ సంస్థ దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతిస్తున్నామని పేర్కొంది. సంగారెడ్డి నుంచి నాందేడ్‌ వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కోసం ఎన్‌హెచ్‌ఏఐ భూసేకరణ చేపట్టింది. ఈ ప్రక్రియలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించలేదంటూ సంగారెడ్డి జిల్లా కంది గ్రామానికి చెందిన నర్సింగ్‌రావు మరికొందరు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు.

వాదనల తర్వాత సింగిల్‌ జడ్జి పిటిషనర్ల అభ్యంతరాలను పరిశీలించి భూసేకరణను చేపట్టాలని తీర్పునిచ్చింది. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ రివ్యూ పిటిషన్‌ వేస్తూ.. మారిన అలైన్‌మెంట్‌కు అనుమతించాలని కోరింది. దీన్ని రివ్యూ కోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్‌హెచ్‌ఏఐ రెండు రిట్‌ అప్పీళ్లను దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సూరేపల్లి నందా ధర్మాసనం ఇటీవల విచారణ చేపట్టింది. యూనియన్‌ ఆఫ్‌ ఇండియా వర్సెస్‌ కుశలశెట్టి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఇక్కడ కూడా నేషనల్‌ హైవేస్‌ యాక్ట్, 1956 ప్రకారమే భూ సేకరణ చేసిందని తెలిపింది. సదరు యజమానులు తగిన పరిహారం పొందడానికి అర్హులేనన్న ధర్మాసనం.. మారిన అలైన్‌మెంట్‌కు సంబంధించి దాఖలైన రిట్‌ అప్పీళ్లను అనుమతిస్తున్నామని వివరించింది.   

మరిన్ని వార్తలు