ఎన్నికలపై స్టే కోరుతూ పిటిషన్‌.. హైకోర్టు ఆగ్రహం

16 Nov, 2020 16:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై స్టే ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాసోజ్‌ శ్రవణ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్‌లో శ్రవణ్‌ పేర్కొన్నారు. రాజకీయంగా వెనకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ నిర్వహించలేదని పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదించారు. అయితే విచారణ సందర్భంగా సంబంధిత వ్యాజ్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిటిషనర్‌ వాదనను తీవ్రంగా తప్పపట్టింది. పదేళ్ల క్రితం తీర్పు ఇస్తే ఇప్పటి వరకు ఏం చేశారని ఘాటుగా ప్రశ్నించింది. ఎంబీసీలపై ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ ఇవ్వబోయే చివరి క్షణంలో సుప్రీంకోర్టు తీర్పు గుర్తొచ్చిందా అంటూ వ్యాఖ్యానించింది. రాజకీయ దురుద్దేశంతో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారని మండిపడింది. చివరికి పిటిషన్‌పై విచారణ చేస్తాం కానీ ఎన్నికలపై స్టే ఇవ్వలేమన్న హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు  కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీకి నోటీసులు జారీచేసింది.

హైకోర్టు తీర్పుపై అభ్యంతరం..
సాక్షి, న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్ట్ పరిహారంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ గతంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. పెళ్లికాని మేజర్ యువతకు విడిగా పరిహారం చెల్లించాలన్న తీర్పుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని వాదించింది.

మరోవైపు తెలంగాణ ప్రభుత్వ వాదనను  ప్రాజెక్ట్ నిర్వాసితుల తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనలను పరిగణనలోకి తీసుకునే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పూర్తి అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్వాసితులను సుప్రీంకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు