మోటారు వాహన చట్ట నిబంధనను తప్పుబట్టిన హైకోర్టు.. కేంద్రం నిబంధన అమానుషం

20 Jan, 2023 08:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాద పరిహార కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన 6 నెలల్లోనే దావా వేయాలన్న మోటారు వాహన చట్ట నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాదంలో ఎవరైనా మృతిచెందితే ఆ కుటుంబం కోలుకోవడానికే సంవత్సరానికిపైగా సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన అమానుషమని పేర్కొంది.

ఈ నిబంధనను సవాల్‌ చేస్తూ దాఖలైన కేసులో అమికస్‌ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా న్యాయవాది పి.శ్రీరఘురామ్‌ను నియమిస్తున్నామని స్పష్టం చేసింది. నిబంధనలను పరిశీలించి ఏం చేయాలన్న దానిపై నివేదిక అందజేయాలని ఆయన్ను ఆదేశించింది. అలాగే కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.

నిజామాబాద్‌ జిల్లా మక్లూర్‌ మండలం అమ్రాడ్‌ గ్రామానికి చెందిన అయిటి హనుమాండ్లు గతేడాది ఏప్రిల్‌ 15న తన భార్య నవనీత సహా ఇద్దరు మైనర్‌ కుమారులతో కలసి ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురికీ తీవ్ర గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక కుమారుడు మృతిచెందాడు.

ఈ నేపథ్యంలో తమ కుమారుడి మరణానికి కారణమైన ద్విచక్రవాహనదారుడి నుంచి పరిహారం కోరుతూ నిజామాబాద్‌ మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌లో గతేడాది నవంబర్‌ 10న హనుమాండ్లు పిటిషన్‌ వేశారు. అయితే అప్పటికే ప్రమాదం జరిగి 6 నెలలు దాటడంతో పిటిషన్‌ను స్వీకరించేందుకు ట్రిబ్యునల్‌ నిరాకరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆయన హైకోర్టుకెక్కారు.   

మరిన్ని వార్తలు