కౌన్సెలింగ్‌కు అనుమతించండి.. తెలంగాణ సర్కార్‌కు షోకాజ్‌ నోటీసులు

2 Nov, 2022 03:07 IST|Sakshi

పీవోఐ విద్యార్థుల పిటిషన్‌లో కాళోజీ వర్సిటీకి హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు తమను అనుమతించాలని కోరుతూ నలుగురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌లో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. వారిని కౌన్సెలింగ్‌కు అనుమతించాలని ఆదేశించింది. అయితే తుది ఉత్తర్వుల మేరకే సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది. విచారణను నవంబర్‌ 15కు వాయిదా వేసింది.

తమను ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ భారత మూలలున్న (పీవోఐ: పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌) టేకుమాల విదిత సహా మరో ముగ్గురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. తాము నాలుగేళ్లుగా తెలంగాణలోనే చదువు తున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ, ఎన్‌ఎంసీ, రాష్ట్ర వైద్యారోగ్య ముఖ్య కార్యదర్శి, కాళోజీ నారాయణ రావు వర్సిటీని ప్రతివాదులుగా పేర్కొన్నారు.

దీనిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలీ, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, కేంద్ర తరఫున అడ్వొకేట్‌ బి.కవిత యాదవ్, ఎన్‌ఎంసీ తరఫున శ్రీరంగ పూజిత, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎ.సంజీవ్‌కుమార్, కాళోజీ వర్సిటీ తరఫున ఎ.ప్రభాకర్‌రావు వాదనలు వినిపించారు. భారత మూలాలున్న వారు, విదేశాల్లో ఉండే భారతీయులు ఇక్కడ ఎంబీబీఎస్‌/బీడీఎస్‌ చదివేందుకు అర్హులేనన్నారు. 

మరిన్ని వార్తలు