‘ఓఆర్‌ఎస్‌’ అమ్మకాలపై కౌంటర్‌ వేయండి

9 Sep, 2022 12:30 IST|Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: శక్తినిచ్చే ఓఆర్‌ఎస్‌ పేరిట పలు సంస్థలు నకిలీ పానీయాలు విక్రయిస్తున్నాయని దాఖలైన కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఆహార భద్రతా సంస్థ జారీ చేసిన నిబంధనలను పాటించకుండా పలు సంస్థలు ఓఆర్‌ఎస్‌ విక్రయాలు చేస్తున్నా చర్యలు తీసుకోవలేవడం లేదంటూ హైదరాబాద్‌ మణికొండలోని ల్యాంకోహిల్స్‌కు చెందిన డాక్టర్‌ ఎం.శివరంజని సంతోష్‌ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్‌) దాఖలు చేశారు.
చదవండి: జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. ముహూర్తం ఫిక్స్‌!

దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిల్‌కు అభ్యంతరం తెలిపిన హైకోర్టు రిజిస్ట్రీని.. నంబర్‌ కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రతివాదులు కౌంటర్‌ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. అనారోగ్యంగా ఉన్న వారికి ఓఆర్‌ఎస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని, డ్రగ్‌ అండ్‌ కాస్మోటిక్‌ చట్టంలోని నిబంధనలను పలు సంస్థలు పాటించడం లేదని పిటిషనర్‌ న్యాయవాది పేర్కొన్నారు.

చక్కెర, ఉప్పు అధిక మోతాదుల్లో ఉన్న డ్రింక్స్‌ను ఓఆర్‌ఎస్‌ పేరిట అమ్మేస్తున్నాయని నివేదించారు. ఇవి తాగితే ఆస్పత్రి కావాల్సి వస్తుందని, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదని వెల్లడించారు. నిబంధలు పాటించకుండా.. బహిరంగంగా విక్రయాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వాదనల విన్న ధర్మాసనం.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణను వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు