సీసీఎస్‌కు రూ.200 కోట్ల బకాయిలు చెల్లించండి 

26 Nov, 2022 03:44 IST|Sakshi

ఆర్టీసీని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘాని(సీసీఎస్‌)కి బకాయిపడ్డ మొత్తం నుంచి ఎనిమిది వారాల్లో రూ.200 కోట్లను చెల్లించాలంటూ ఆర్టీసీని హైకోర్టు ఆదేశించింది. ఇందులో రూ.100 కోట్లను నాలుగు వారాల్లో, మిగిలిన రూ.100 కోట్లను ఆ తర్వాతి నాలుగు వారాల్లో చెల్లించాలని పేర్కొంది. ఈ వివరాలను న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి జమ చేయాల్సిన నిధులను సంస్థ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి.

ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని నెలలుగా ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో ఆ సంఘం ఇటీవలే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దీనిపై శుక్రవారం వాదనలు జరిగాయని.. ఆర్టీసీ పక్షాన అడ్వొకేట్‌ జనరల్, సీసీఎస్‌ తరఫున తాను వాదనలు వినిపించినట్లు జయప్రకాశ్‌రావు వెల్లడించారు. వాదనలు తర్వాత.. నాలుగు వారాల్లో రూ.100 కోట్లు, మరో నాలుగు వారాల్లో మిగతా రూ.100 కోట్లు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తాను కేసును మానిటర్‌ చేస్తానని, ఆరు వారాల తర్వాత మళ్లీ పరిశీలిస్తానని, రూ.వంద కోట్లు చెల్లించిందీ.. లేనిదీ.. తెలుసుకుంటానని కూడా న్యాయమూర్తి ప్రస్తావించారని ఆయన వివరించారు.    

మరిన్ని వార్తలు