వర్మకు షాక్‌: ‘దిశ ఎన్‌కౌంటర్‌’ విడుదలకు బ్రేక్‌

15 Jun, 2021 00:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు షాక్‌ తగిలింది. ఆయన దర్శకత్వం వహించిన ‘దిశ ఎన్‌కౌంటర్‌’ సినిమా విడుదలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. రెండు వారాల వరకు విడుదల చేయొద్దని చిత్రబృందానికి ఆదేశించింది. సినిమా ప్రొడ్యూసర్ల పేర్లపై పిటిషన్‌లో గందరగోళం ఉందని హైకోర్టు పేర్కొంది. నిర్మాత రాంగోపాల్‌వర్మ అని చెప్పిన పిటిషనర్‌.. వర్మ కాదు అనురాగ్‌ అని కోర్టుకు తెలిపిన న్యాయవాది. దిశ సినిమా పేరును నిశా ఎన్‌కౌంటర్‌గా మార్చామని ఈ సందర్భంగా న్యాయవాది తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఘటన ఆధారంగా వర్మ ఈ సినిమా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుదల ఆపాలని బాధితురాలి తండ్రి వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం సోమవారం పై విధంగా ఆదేశాలు ఇచ్చింది. దిశ సంఘటనతోపాటు అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ‘దిశా ఎన్‌కౌంటర్‌’ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు