రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోండి

4 Aug, 2020 03:28 IST|Sakshi

అప్పటిదాకా భూములను స్వాధీనం చేసుకోవద్దు 

నేషనల్‌ హైవేస్‌ అథారిటికీ హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం నుంచి దేవరపల్లికి వేస్తున్న జాతీయ రహదారి నిమిత్తం సేకరిస్తున్న భూములకు సంబంధించి రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని నేషనల్‌ హైవేస్‌ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. రైతుల అభ్యంతరాలపై చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకునే వరకు వారి భూములను స్వాధీనం చేసుకోరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. తమ భూముల స్వాధీనానికి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ చట్టం సెక్షన్‌ 3(ఎ) కింద ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ ఆ ప్రాంతానికి చెందిన రైతు కె.రాజశేఖర్‌రెడ్డితోపాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.

దాదాపు 2 వేల మంది రైతులకు చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది కౌటూరు పవన్‌కుమార్‌ నివేదించారు. పర్యావరణ చట్టాలతోపాటు రాజ్యాంగ విరుద్ధంగా ఈ భూసేకరణ నోటిఫికేషన్‌ జారీ చేశారని తెలిపారు. నోటిఫికేషన్‌పై గత డిసెంబర్‌ 9న రైతులు అభ్యంతరాలను తెలియజేశారని, అయినా వాటిని పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఈ మేరకు న్యాయమూర్తి స్పందిస్తూ రైతుల అభ్యంతరాలపై చట్టపరంగా తగిన నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు వారి భూములను స్వాధీనం చేసుకోరాదని ఆదేశించారు. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నేషనల్‌ హైవేస్‌ అథారిటీని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలపాటు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు