రీపోస్టుమార్టం నిర్వహించండి 

25 Sep, 2020 03:56 IST|Sakshi

ఎంజీఎం ఫోరెన్సిక్‌ వైద్యులతో ఇది చేయించాలి 

ఆ ప్రక్రియ మొత్తం వీడియో తీయాలి 

పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయండి 

చర్ల ఎన్‌కౌంటర్‌పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను వారి బంధువుల నుంచి వెంటనే స్వాధీనం చేసుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరచాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రి ఫోరెన్సిక్‌ వైద్య బృందంతో మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని, ఈ మొత్తం ప్రక్రియను ఫొటోలు, వీడియోలు తీయాలని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల తో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

చర్ల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురి మృతదేహాలకు రీపోస్టుమార్టం చేసేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం అత్యవసరంగా విచారణకు స్వీకరించింది. ఎన్‌కౌంటర్‌ పేరుతో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడిని పోలీసులు హత్య చేశారని, మృతదేహాలకు రీపోస్టుమార్టం చేయించేలా ఆదేశించడంతోపాటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసేలా ఆదేశించాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది వి.రఘునాథ్‌ వాదనలు వినిపించారు. తూతూమంత్రంగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారని, ఆధారాలను మాయం చేసేందుకే పోలీసులు ఇలా చేశారని కోర్టుకు నివేదించారు. కాగా, ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారని, వారిని సోది జోగయ్య, మడకం మంగ్లి, మడకం మల్లిగా గుర్తించామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌ నివేదించారు.

పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు మృతదేహాలను అప్పగించామని చెబుతూ.. ఈ మేరకు శవాలను బంధువులకు అప్పగించినట్లుగా ఉన్న పత్రాలను ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ ప్రక్రియను వీడియో తీశామని వివరించారు. అయితే ఆధారాలను మాయం చేసేందుకే పోలీసులు పోస్టుమార్టం చేసి మృతదేహాలకు వెంటనే అంత్యక్రియలు చేయించేందుకు ప్రయత్నిస్తున్నారని రఘునాథ్‌ ఆరోపించారు. మృతదేహాలను వెంటనే వారి బంధువుల నుంచి స్వాధీనం చేసుకొని భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో భద్రపరిచేలా చర్యలు తీసుకుంటామని ఏజీ నివేదించారు.  ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్‌ 5కు వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు