కబ్జాదారులపై ఏం చర్యలు తీసుకున్నారు?

31 Jul, 2020 03:13 IST|Sakshi

ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం లేదు

ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలను తొలగించండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం... విచారణ ఆగస్టు 17వ తేదీకి వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: చెరువుల గరిష్ట నీటి మట్టం (ఎఫ్‌టీఎల్‌) పరిధిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలను తొలగించాలని, భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణా లు చేపట్టకుండా  జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేపడుతోందని పిటిషనర్‌ ఆరోపిస్తున్న నేపథ్యంలో రోడ్డు పనులను వెంటనే నిలిపివేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఖాజాగూడ చెరువు ఎఫ్‌టీఎల్‌ విస్తీర్ణం మ్యాపులను మార్చేశారని, ప్రభుత్వమే రోడ్డు నిర్మాణం చేపడుతోందని, ఈ నేపథ్యంలో చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సోషలిస్టుపార్టీ తెలంగాణ విభాగం కార్యదర్శి డాక్టర్‌ లుబ్నాసార్వత్‌ రాసిన లేఖను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గతంలో సుమోటో ప్రజాహిత వ్యా జ్యంగా స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని గురు వారం మరోసారి విచారించింది.

ప్రభుత్వం ఏమైనా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టిందా అని ధర్మాసనం ప్రశ్నించగా ప్రభుత్వ న్యాయవాది లేదని సమాధానమిచ్చారు. గత ఏడాది ఇలాంటి అంశాన్నే విచారిస్తున్న సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువులను ఎప్పుడైనా చూశారా అని కమిషనర్‌ను ప్రశ్నించగా లేదని చెప్పడం తనకు ఆశ్చర్యాన్ని కల్గించిందన్నారు. చెరువుల ఆక్రమణకు సంబంధించి ఏడాది కాలంగా తాను ప్రభుత్వ అధికారుల తీరును పరిశీలిస్తున్నానని, జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల మధ్య సమన్వయం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

జీహెచ్‌ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించా ల్సిన అవసరం ఉందన్నారు. నిర్మల్‌ జిల్లాలో చెరువుల పరిరక్షణ కోసం కలెక్టర్, డీఎస్పీతో కూడిన చెరువుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారని, అదే తరహాలో ఇక్కడా ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. చెరువుల పరిరక్షణ కమిటీల ఏర్పాటుకు ఏం చర్యలు తీసుకున్నా రు,  ఆక్రమణల తొలగింపు చర్యలను వివరిస్తూ ఆగస్టు 17లోగా పూర్తి వివరాలను సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా