BJP Meeting In Warangal: వరంగల్‌లో బీజేపీ సభకు హైకోర్టు అనుమతి

27 Aug, 2022 03:53 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హనుమకొండలో బీజేపీ బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇక్కడి సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రాంగణంలో శనివారం బహిరంగ సభ నిర్వహించుకునేందుకు బీజేపీకి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఇటీవల రాష్ట్రంలో పలు బహిరంగ సభలకు అనుమతినిచ్చి, ఈ సభకు నిరాకరించడం సరికాదని పేర్కొంది. అయితే ఎలాంటి రెచ్చగొట్టే, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయవద్దని షరతు పెట్టింది.

ప్రదర్శనలు, సభలు, ర్యాలీలను నిషేధిస్తూ పోలీసులు జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టవ్యతిరేకమని, దానిని సస్పెండ్‌ చేస్తున్నామని ప్రకటించింది. అయితే సభ ఎంతసేపు నిర్వహిస్తారు, ఎందరు జనం వస్తున్నారు, పార్కింగ్‌ ఏర్పా ట్లు తదితర వివరాలను వరంగల్‌ సీపీకి అందజేయాలని బీజేపీ నేతలకు సూచించింది. సభలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా అందుకు పిటిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. 

సభకు అనుమతి కోరుతూ కోర్టుకు.. 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా.. 27న హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ప్రాంగణంలో బహిరంగ సభ చేపట్టారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ నుంచి సభ నిర్వహణ కోసం ఈ నెల 23న అనుమతి తీసుకున్నారు. కానీ తాము ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్టు 25వ తేదీన ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. శాంతిభద్రతల కారణాలతో సభకు అనుమతించబోమని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రిన్సిపాల్‌ సభకు అనుమతి ఇచ్చినా పోలీసుల ఒత్తిడి వల్ల రద్దు చేశారని.. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని విన్నవించారు. ఏదైనా పార్టీకిగానీ, సొసైటీకిగానీ సభలు, సమావేశాలు నిర్వహించుకునే ప్రాథమిక హక్కు ఉందంటూ.. గతంలో సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను తమ పిటిషన్‌కు జత చేశారు. 

మధ్యాహ్నం కొనసాగిన వాదనలు..  
బీజేపీ నేతల పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ శుక్రవారం మధ్యాహ్నం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. యూనివర్సిటీలు, కాలేజీలు రాజకీయ సభలు, సమావేశాలకు వేదిక కారాదని గతంలో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని, సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందనే ప్రిన్సిపాల్‌ సభకు అనుమతి రద్దు చేశారని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరఫున అడ్వొకేట్‌ ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ఇతర పాదయాత్రలు, సభలకు అనుమతిచ్చి.. ఈ సభకు ఇవ్వకపోవడం సరికాదని న్యాయమూర్తికి వివరించారు. ప్రత్యేక రాజకీయ ఎజెండాతోనే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

ఇలా దాదాపు 2 గంటల పాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయమూర్తి తన తీర్పు వెలువరించారు. రాష్ట్రంలో సభలు, సమావేశాల నిర్వహణకు ప్రత్యేక మార్గదర్శకాలేమీ లేవని గుర్తు చేశారు. గత వారం రోజుల్లో పలు సభలకు అనుమతి ఇచ్చి ఈ సభకు నిరాకరించడం సరికాదని పేర్కొన్నారు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్‌ సభను నిరాకరించిన కారణాలు ఇక్కడ వర్తించవని చెప్పారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని కాలేజీలపైనే వీసీకి అధికారం ఉంటుందని.. మరో ప్రాంతంలోని కాలేజీలపై నిర్ణయాధికారం ఉండదని పేర్కొన్నారు. అయినా ఇక్కడ కాలేజీ, గ్రౌండ్‌ రెండూ కలిసి లేవని.. సభ కారణంగా విద్యార్థులకు ఇబ్బంది ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. సభ నిర్వహణ, శాంతిభద్రతలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అధికారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు మాత్రమే ఉంటుందని.. కిందిస్థాయి అధికారులకు ఉండదని చట్టం చెబుతోందని వివరించారు. సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.   
చదవండి: అదే జరిగితే.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఏడాది జైల్లోనే! 

మరిన్ని వార్తలు