ఏపీనే రూ.4,774 కోట్లు బాకీ 

14 Jun, 2022 02:13 IST|Sakshi

విద్యుత్‌ బకాయిలపై హైకోర్టులో తెలంగాణ పిటిషన్‌

సాక్షి, హైదరాబాద్‌: విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ తమకు రూ.4,774 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య సమసిన విద్యుత్‌ బకాయిల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ దాదాపు రూ.6వేల కోట్లు బకాయి ఉందంటూ హైకోర్టులో ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీ వల ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన సీజే జస్టిస్‌ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం.. పిటిషన్‌ను అనుమతిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఏపీ జెన్‌కో, పెన్షన్‌ అండ్‌ గ్రాట్యు టీ ట్రస్ట్, ఏపీ విద్యుత్‌ డిపార్ట్‌మెంట్, ఏపీ పవర్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా ప్రతివాదులంతా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, 2022 జనవరి 31 నాటికి అసలు కింద రూ.2,698 కోట్లు, వడ్డీ కింద రూ.2,076 కోట్లు.. మొత్తంగా రూ.4,774 కోట్లు ఏపీ బాకీ ఉన్నట్లు తెలంగాణ పిటిషన్‌లో పేర్కొంది.  

మరిన్ని వార్తలు