‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్‌ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు

27 Aug, 2021 02:25 IST|Sakshi

కుతుబ్‌షాహీ టూంబ్స్‌ చుట్టూ కాంక్రీట్‌ జంగిల్‌ తయారైంది  

రామప్ప’విషయంలో అలా కావద్దు: హైకోర్టు  

యునెస్కో నిర్ధేశించిన పనులను సకాలంలో పూర్తిచేయండి 

సాక్షి, హైదరాబాద్‌: రామప్ప ఆలయానికి వరల్డ్‌ హెరిటేజ్‌ గుర్తింపునిస్తూ యునెస్కో ప్రకటించిన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో నిర్ణీత దూరం వరకు ఎటువంటి కట్టడాలకు అనుమతి ఇవ్వరాదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆలయ శిల్పకళకు, పర్యావరణానికి విఘాతం కలగకుండా ఆలయం చుట్టూ కొంత ప్రాంతాన్ని నిర్మాణ నిషిద్ధ (బఫర్‌జోన్‌) ప్రాంతంగా ప్రకటించాలని ఆదేశించింది. అంతర్జాతీయ పర్యాటకుల బసకు వీలుగా చేపట్టే నిర్మాణాలు ఆలయానికి దూరంగా ఉండాలని తేల్చిచెప్పింది. నగరంలోని చారిత్రక కుతుబ్‌షాహీ టూంబ్స్‌ చుట్టూ కాంక్రీట్‌ జంగిల్‌ తయారైందని, రామప్ప ఆలయ పరిసరాలు అలా మారకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

యునెస్కో నిర్ధేశించిన మేరకు శాశ్వత గుర్తింపు లభించేందుకు అవసరమైన పనులను సకాలంలో పూర్తిచేయాలని, అందుకు మైలురాళ్లు నిర్ధేశించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పత్రికల్లో వచ్చిన కథనాలను గతంలో ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి యునెస్కో నిర్దేశించిన మేరకు పనులు పూర్తిచేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. 

2022 డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలి 
యునెస్కో నిర్ధేశించిన మేరకు పనులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్‌లోగా కాకుండా 2022 డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ సూచించిందని కేంద్రం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) అధికారులతో కూడా కమిటీ వచ్చే వారంలో సమావేశమై.. బఫర్‌ జోన్‌ను ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల సమావేశం నిర్వహించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్‌ జీపీ హరీందర్‌ నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం రానున్న నాలుగు వారాల్లో తీసుకున్న చర్యలను వివరిస్తూ తాజా నివేదికను సెప్టెంబర్‌ 29లోగా సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. 

మరిన్ని వార్తలు