దేవరయాంజాల్‌: ఏ చట్టం ప్రకారం జీవో ఇచ్చారు?

9 May, 2021 02:24 IST|Sakshi

దేవరయాంజాల్‌ భూములపై సర్కారును ప్రశ్నించిన హైకోర్టు

నోటీసులివ్వకుండా ఆ భూముల్లోకి వెళ్లొద్దు.. పేపర్‌ కథనాల ఆధారంగా జీవో జారీ చేస్తారా?

వివరణ తర్వాతే నివేదిక రూపొందించాలని ఆదేశం

సర్కారు తీరుపై హైకోర్టు అసహనం

సాక్షి, హైదరాబాద్‌: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలంలోని దేవరయాంజాల్‌ ఆలయ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏ చట్టం ఆధారంగా ఐఏఎస్‌ అధికారుల విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం జీవో 1014 జారీ చేసిందని ప్రశ్నించింది. దేవాదాయ చట్టమా.. రెవెన్యూ చట్టమా అన్నది కూడా జీవోలో ఎక్కడా పేర్కొనలేదని ఆక్షేపించింది. పాతికేళ్లుగా నలుగుతున్న ఈ వివాదంపై పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హడావుడిగా జీవో జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీసింది. కరోనాతో రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్న భయానకమైన పరిస్థితుల్లో నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఈ విచారణకు కేటాయించడం ఎంతవరకు సమంజసమంటూ మండిపడింది. దేవరయాంజాల్‌ భూముల ఆక్రమణ ఆరోపణలకు సంబంధించి నోటీసులు జారీచేయకుండా అధికారులు ఎవరి భూముల్లోకీ వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ ఇచ్చేందుకు నిర్ధిష్ట సమయం ఇవ్వాలని, వారి వివరణ తీసుకున్న తర్వాతే నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అప్పటివరకు పిటిషనర్ల భూముల్లో జోక్యం చేసుకోరాదని, కూల్చివేతలాంటి బలవంతపు చర్యలకు పాల్పడొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ తడకమల్ల వినోద్‌కుమార్‌ శనివారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తమ భూముల్లోకి రెవెన్యూ అధికారులు ప్రవేశించి సర్వే చేయడాన్ని సవాల్‌ చేస్తూ సదా సత్యనారాయణరెడ్డితో పాటు మరికొందరు అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి శనివారం విచారించారు.

ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం
‘1925లో ఆలయాలకు నిజాం భూములు కేటాయించారు. దీంతో ఈ ప్రాంతానికి దేవరయాంజాల్‌గా పేరు వచ్చింది. మెజారిటీ భూములకు రిజిస్ట్రర్డ్‌ డాక్యుమెంట్లు ఉన్నాయి. 1996 సంవత్సరం నుంచి అంటే దాదాపుగా 25 ఏళ్లుగా ఈ భూములకు సంబంధించిన దేవాదాయ ట్రిబ్యునల్‌లో వివాదం నడుస్తోంది. 2021 మే 2న ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా అదే నెల 3న నలుగురు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఇంత హడావుడి చర్యలను చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశాన్ని అనుమానించాల్సి వస్తోంది. మా ఇంటి పక్కన కరోనాతో ఓ వ్యక్తి శుక్రవారం చనిపోతే శనివారం ఉదయం 9 గంటలకు కానీ అంత్యక్రియలు పూర్తి చేయలేని పరిస్థితి. అదీ ఓ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ జోక్యం చేసుకుంటేనే. అంత రద్దీగా ఉన్నాయి శ్మశానాలు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఈ భూములు సర్వే చేయాలంటూ హడావుడిగా జీవో జారీ చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. పాతికేళ్లుగా నలుగుతున్న ఈ వివాదం మీద ఇంత ఆగమేఘాల మీద విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం. కరోనాతో అనేక మంది మృత్యువాతపడుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఇంత హడావుడిగా ఈ సర్వే చేయాల్సిన అవసరం ఉందా’అని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. 

అద్దెకున్న వారినీ బెదిరిస్తున్నారు..
‘ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా రెవెన్యూ అధికారులు అక్రమంగా వాహనాల్లో పిటిషనర్ల భూముల్లోకి ప్రవేశించారు. సర్వే పేరుతో భయానకమైన పరిస్థితులు కల్పించారు. ఆ భూముల్లో గోడౌన్లు ఉన్నాయి. గోడౌన్లను అద్దెకు తీసుకున్న వారిని ఖాళీ చేయాలంటూ అధికారులు బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఈ భూముల యాజమాన్య హక్కులు తేలే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కరోనా నేపథ్యంలో వైద్య అవసరాలకు మినహా మిగిలిన వారెవరినీ వారి భూముల నుంచి ఖాళీ చేయించడానికి వీల్లేదని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జూన్‌ 30 వరకు అమలులో ఉంటాయి. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా ఐఏఎస్‌ అధికారుల విచారణ కొనసాగుతోంది. నోటీసులు జారీ చేయకుండా, వివరణ తీసుకోకుండా పిటిషనర్ల భూముల్లోకి వెళ్లకుండా ఆదేశాలు జారీచేయండి’అని పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ప్రాథమిక విచారణ మాత్రమే: ఏజీ 
ఐఏఎస్‌ అధికారులు ప్రాథమిక విచారణ మాత్రమే చేస్తున్నారని, కమిటీని నియమించే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ నివేదించారు. కమిటీ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని, అప్పటివరకు కూల్చివేతలు లాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని నివేదించారు. జీవో 1014కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలిపారు.

హడావుడి చేశారు..
‘రికార్డుల ఆధారంగా విచారణ చేసుకోవచ్చు. పిటిషనర్ల భూముల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాల్సిందే. వాహనాల్లో వెళ్లి హడావుడి చేశారు. ప్రాథమిక విచారణకు సైతం నోటీసులు జారీ చేయాల్సిందే. సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగానే అధికారులు వ్యవహరించాలి’అని న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) దేవాదాయ, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు దేవాదాయ శాఖ కమిషనర్, మేడ్చల్‌ మల్కాజిగిరి కలెక్టర్, సీతారామచంద్రస్వామి ఆలయ ప్రత్యేకాధికారిని ఆదేశిస్తూ విచారణను వేసవి సెలవుల తర్వాతకి వాయిదా వేసింది.  

మా ఇంటి పక్కన కరోనాతో ఓ వ్యక్తి శుక్రవారం చనిపోతే శనివారం ఉదయం 9 గంటలకు కానీ అంత్యక్రియలు పూర్తి చేయలేని పరిస్థితి. అదీ ఓ మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ జోక్యం చేసుకుంటేనే. అంత రద్దీగా ఉన్నాయి శ్మశానాలు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్న సమయంలో ముగ్గురు జిల్లా కలెక్టర్లు, ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని ఈ భూములు సర్వే చేయాలంటూ హడావుడిగా జీవో జారీ చేయడం అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తోంది. పాతికేళ్లుగా నలుగుతున్న ఈ వివాదం మీద ఇంత ఆగమేఘాల మీద విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ తీరు ఆక్షేపణీయం. 
– జస్టిస్‌ వినోద్‌ కుమార్‌ 


చదవండి: ఈటలపై ఆరోపణలు.. దేవరయాంజాల్‌లో చురుగ్గా విచారణ

మరిన్ని వార్తలు