పోస్టింగ్‌లు లేకుండా జీతాలా? తెలంగాణ సీఎస్‌పై హైకోర్టు ఆగ్రహం

19 Jan, 2022 08:48 IST|Sakshi

మార్చి 14లోగా కౌంటర్‌ వేయాలి 

లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలి 

10 నెలలైనా కౌంటర్‌ వేయకపోవడంతో సీఎస్‌పై ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో విధులు నిర్వహిస్తున్న పదుల సంఖ్యలో ఉద్యోగులకు కొన్ని నెలలుగా పోస్టింగులివ్వకుండా వేధిస్తున్నా రంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాదాపు 10 నెలలైనా కౌంటర్‌ ఎందుకు దాఖలు చేయలేదని, సీఎస్సే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగని ప్రశ్నించింది.

మార్చి 14లోగా కౌంటర్‌ దా ఖలు చేయాలని, లేకపోతే సీఎస్‌ వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏయే విభాగాల్లో ఎంత మంది అధికారులకు పోస్టింగ్‌ లేకుండా జీతాలిస్తున్నారు? తదితర వివరాలు సమర్పించాలంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

అది ప్రజాధన దుర్వినియోగమే..
రెవెన్యూ, కమర్షియల్‌ ట్యాక్స్, ఎక్సైజ్‌ విభాగా ల్లో దాదాపు 40 నుంచి 50 మంది అధికారుల కు నెలల తరబడి పో స్టింగులు ఇవ్వడం లేదని, విధులు నిర్వహించకపోయినా వారికి వేతనాలు ఇస్తున్నారని మాజీ ఉద్యోగి బి. నాగధర్‌సింగ్‌ వ్యాజ్యం దాఖలు చేశారు. ‘పోస్టిం గ్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ విభా గం ఉన్నతాధికారి నుంచి ఆ ఉద్యోగికి చెల్లించిన జీతభత్యాలను వసూలు చేయాలి.

క్రమశిక్షణా చర్యలు చేపట్టాలి’అని కోరారు. ఆ పిటిషన్‌ను ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషన్‌పై సీఎస్‌ ఇంకా కౌంటర్‌ వేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వెంకన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్‌ దాఖలుకు మరో 4 వారాలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించారు. ధర్మాసనం స్పందిస్తూ.. విధులు నిర్వహించకపోయినా జీతాలు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంది. కౌంటర్‌ దాఖలుకు ఇదే చివరి అవకాశమంటూ విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు