అంబులెన్సులు ఆపొద్దు... ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

15 May, 2021 08:30 IST|Sakshi

ప్రజల జీవించే హక్కు కాలరాసే అధికారం ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా రోగులతో ఉన్న అంబులెన్సులను ఆపేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘ప్రాంతీయ భావంతో ప్రజల ప్రాణాలు తీస్తారా, రాజ్యాంగం కల్పిం చిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా వ్యవహరిస్తారా? ప్రజల జీవించే హక్కును కాలరాస్తారా’ అని మండిపడింది. కేంద్రం అనుమతి లేకుండా జాతీయ రహదారులపై అంబులెన్స్‌లను ఆపే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీసింది. సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా, ఈ నెల 11న తామిచ్చిన ఆదేశాలను ఉల్లంఘించేలా రాష్ట్ర ప్రభుత్వ మెమో ఉందని.. ఆ మెమో జారీచేసిన అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అంబులెన్సులను రాష్ట్ర సరిహద్దుల్లో ఆపేసేలా ఇచ్చిన ఆదేశాల అమలును నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించాలంటే కంట్రోల్‌ రూం ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. రాష్ట్రంలోకి అంబులెన్సుల ప్రవేశానికి సంబంధించిన ఈ మెమోను మార్చి.. మరో రూపంలో ఆదేశాలు ఇవ్వడానికి కూడా వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని, సరిహద్దుల్లో ఉన్న అధికారులకు సమాచారమిచ్చి అం బులెన్స్‌ల ప్రవేశానికి ఇబ్బంది లేకుండా చూడాలని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని ఆదేశించింది. 


మా ఆదేశాలకు వక్రభాష్యం
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇక్కడి ప్రజల ప్రయోజనం కోసం అంబులెన్సుల నిలిపివేత ఆదేశాలు ఇచ్చినట్లు కనిపించడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ప్రాంతీయ భావంతోనే ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వైద్యం కోసం రాకుండా అడ్డుకునేందుకు ఈ తరహా ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. రాతపూర్వక ఆదేశాలు ఇవ్వకుండా అంబులెన్స్‌ల ప్రవేశాన్ని ఎలా నిలిపివేస్తారని గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అంబులెన్స్‌లు ఆపొద్దంటూ ఈనెల 11న మేమిచ్చిన ఉత్తర్వులకు రాష్ట్ర ప్రభుత్వం వక్రభాష్యం చెప్పింది. కరోనా రోగులతో ఉన్న అంబులెన్సుల ప్రవేశాన్ని ఏ చట్టం నిషేధించట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివక్షాపూరితంగా ఉంది. అహ్మదాబాద్‌లో ప్రభుత్వ అంబులెన్సుల్లో వచ్చే వారినే అడ్మిట్‌ చేసుకోవాలంటూ, ఒక సిటీ నుంచి మరో సిటీలోని ఆస్పత్రుల్లో రోగులు చేరకుండా ఇచ్చిన ఉత్తర్వులను ఆ రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో రోగుల అడ్మిషన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే తరహా విధానాన్ని రూపొం దించాలని సుప్రీం కోర్టు ఇటీవలే కేంద్రాన్ని ఆదేశించింది కూడా. స్థానికత ఆధారంగా వైద్యం అందిస్తామనడం, ముందస్తు అనుమతి ఉంటేనే కరోనా రోగుల అంబులెన్స్‌లను రాని స్తామనడం దారుణం’ అని ధర్మాసనం పేర్కొం ది. ఈ వ్యవహారంపై రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశిస్తూ.. విచారణను జూన్‌ 17కు వాయిదా వేసింది.


పలు రాష్ట్రాలు ఈ తరహా ఆదేశాలిచ్చాయి: ఏజీ
సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి పెద్ధ సంఖ్యలో కరోనా రోగులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నారని.. ఇక్కడ అడ్మిషన్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ హైకోర్టుకు వివరించారు. వారంతా రోడ్ల మీదే నిరీక్షిస్తుండటంతో కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ‘కరోనా రోగుల ప్రవేశాన్ని కట్టడి చేస్తూ రాజస్తాన్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన కరోనా రోగులను ఆ రాష్ట్రంలోకి అనుమతించట్లేదు. తెలంగాణ ప్రభుత్వం అంత తీవ్రమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులకు వైద్యం నిరాకరించట్లేదు. కరోనా కట్టడి, లాక్‌డౌన్‌లో భాగంగానే.. ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ లేనివారి అంబులెన్స్‌ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నిబంధనలకు లోబడే ఉంది’ అని వివరించారు.

వివక్ష చూపించడమే: ఏపీ ఏజీ ఎస్‌.శ్రీరాం
అంబులెన్సుల కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టాల మేరకు మెమో జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నా.. ఆ చట్టాల సారాంశానికి విరుద్ధంగా ఆ మెమో ఉంది. నివాస ప్రాంతం ఆధారంగా కరోనా రోగుల ప్రవేశాన్ని నియంత్రిస్తామనడం వివక్ష చూపడమే. కంట్రోల్‌ రూం ముందస్తు అనుమతి పేరుతో జాప్యం జరిగితే.. తగిన సమయంలోగా వైద్యం అందక రోగులు చనిపోయే ప్రమా దం ఉంది. అంబులెన్స్‌ల ప్రవేశానికి సంబంధించి తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వులు ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి గురువారం రాత్రి అందాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచే సరిహద్దుల్లో అంబులెన్స్‌ లు ఆపుతున్నారు. ముందస్తు అనుమతి పేరిట వివక్షతో ప్రాణాలు తీస్తారా?’ అని పేర్కొన్నారు.  

చదవండి : తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత

సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపేయడం దురదృష్టకరం: సజ్జల

మరిన్ని వార్తలు