ఇది కోర్టు ధిక్కరణే...!

23 Apr, 2021 09:24 IST|Sakshi

 సుప్రీం తీర్పు ప్రకారం బీసీ గణన ఎందుకు చేయలేదు ?

సాక్షి, హైదరాబాద్‌: బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలంటూ 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది.

బీసీ సమగ్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై బీసీ కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను నిర్ణయించామంటూ గతంలో అదనపు ఏజీ పేర్కొన్న నేపథ్యంలో, బీసీ కమిషన్‌ నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో తాను పొరపాటున అలా చెప్పానని, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు ఏజీ నివేదించారు. బీసీ గణన కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి నివేదిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. కాగా, ఏజీ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మేష్‌ డీకే జైశ్వాల్‌ నివేదించారు.  పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 201ను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో స్పష్టం చేస్తూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది.

( చదవండి: హైదరాబాద్ ఐఎస్‌బీ.. దేశంలోనే టాప్‌! )

మరిన్ని వార్తలు