చార్మినార్‌నూ రిజిస్టర్‌ చేస్తారా?

24 Feb, 2021 06:35 IST|Sakshi

దానంగా ఇస్తే రాజ్‌భవన్‌ను కూడా చేస్తారా? 

హఫీజ్‌పేట భూముల వివాదంలో వక్ఫ్‌బోర్డుకు హైకోర్టు ప్రశ్న 

సాక్షి, హైదరాబాద్‌: దానం చేస్తున్న వ్యక్తికి సదరు ఆస్తిపై హక్కులు ఉన్నాయా లేదా అన్నది చూడకుండా దానం ఇస్తే చార్మినార్, రాజ్‌భవన్‌లను కూడా రిజిస్టర్‌ చేసుకుంటారా? అని వక్ఫ్‌బోర్డును హైకోర్టు ప్రశ్నించింది. వక్ఫ్‌బోర్డుకు 65 ఏళ్ల కిందట ఇచ్చిన భూమిని 2014 వరకు ఎందుకు రిజిస్టర్‌ చేసుకోలేదని నిలదీసింది. హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్‌ 80లోని భూములను వక్ఫ్‌బోర్డు భూములుగా పేర్కొంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాల్‌చేస్తూ కె.ప్రవీణ్‌కుమార్, సాయిపవన్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తోపాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ భూములు మునీరున్నీసా బేగంకు చెందినవని, 1966లో వాటిని విక్రయించిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది నివేదించారు. 2006లో ఈ భూములపై తుది డిక్రీ వచ్చిందని, సుప్రీంకోర్టులో సైతం రాష్ట్రానికి చుక్కెదురైందని తెలిపారు.

1955లో మునీరున్నీసా వక్ఫ్‌నామాగా ప్రభుత్వం పేరొంటున్నా అందులో ఆమె సంతకంలేదని, అయితే 1966లో ఆమె ఆ భూమిని విక్రయించినప్పుడు సంతకాలు చేసిందని తెలిపారు. 2014 నవంబర్‌లో ఈ భూమిని వక్ఫ్‌బోర్డు భూమిగా పేర్కొంటూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిందన్నారు. హఫీజ్‌పేట భూములు ప్రభుత్వానికి చెందినవని, 1963లో నిజాం వారసులుగా పేర్కొంటూ కొందరు ఈ ఆస్తులను పంచుకున్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు నివేదించారు. మునీరున్నీసా చనిపోయిన తర్వాత తప్పుడు పత్రాలతో ఈ రిజిస్ట్రేషన్‌ జరిగిందని ముతవల్లీ తరఫు న్యాయవాది అనుమానం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో వక్ఫ్‌బోర్డు తరఫు న్యాయవాది వాదనలకోసం ధర్మాసనం విచారణను బుధవారానికి వాయిదావేసింది.

చదవండి: కెనడా నుంచి వచ్చి ఇంట్లో ఉరేసుకుని..

మరిన్ని వార్తలు