బీఆర్‌ఎస్‌ ఎంపీకి హైకోర్టులో చుక్కెదురు

19 Mar, 2023 08:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తన ఎన్నిక చెల్లదని ఆదేశాలివ్వాలంటూ కాంగ్రెస్‌ నేత మదన్‌మోహన్‌రావు వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని పాటిల్‌ హైకోర్టులో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్‌(ఐఏ) దాఖలు చేశారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసనం పాటిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. మెయిన్‌ పిటిషన్‌(మదన్‌మోహన్‌ దాఖలు చేసిన)లో రోజూవారీగా వాదనలు వింటామని పేర్కొంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై 6 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే జార్ఖండ్‌లో పాటిల్‌పై ఓ క్రిమినల్‌ కేసు నమోదైందని, ఆ వివరాలను ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొలేదని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని మదన్‌మోహన్‌రావు హైకోర్టులో ఎలక్షన్‌ పిటిషన్‌ వేశారు. వాదనలు విన్న సింగిల్‌ జడ్జి 2022 జూన్‌లో ఆ పిటిషన్‌ను కొట్టివేశారు.

అయితే దీన్ని మదన్‌మోహన్‌రావు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. తెలంగాణ హైకోర్టు జూన్‌ 15న మౌఖిక తీర్పు ఇచ్చిందని, 3 నెలలైనా  తీర్పు ప్రతిని బహిర్గతం చేయలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. తీర్పు ప్రతులు ఇవ్వకపోవడం సరికాదని, తీర్పు ఉత్తర్వులు లేకుండా తాము వాదనలు వినలేమని, ఆరు నెలల్లోపు వేగవంతంగా కేసును పరిశీలించి తీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సూచించింది. దీంతో విచారణను సీజే ధర్మాసనం చేపట్టింది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు