ఈసీ ఉత్తర్వులు సబబే

29 Oct, 2021 05:00 IST|Sakshi

దళితబంధుపై హైకోర్టు స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ‘దళితబంధు’అమలును నిలిపివేయాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. మరో మూడు రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఈ దశలో ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. ఈ మేరకు ‘దళితబంధు’ను కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పునిచ్చింది.

ఎన్నిక పూర్తయ్యే వరకు ‘దళితబంధు’ను నిలిపివేస్తూ సీఈసీ ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సీనియర్‌ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్‌ పార్టీ నేత జడ్సన్‌తోపాటు దళితబంధును ఆపాలంటూ వాచ్‌ వాయిస్‌ ఆఫ్‌ ది పీపుల్‌ స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉంది. ఈసీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చింది. దళితబంధు పథకంతో నేరుగా ఓటర్ల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఈ పథకం ఆపాలన్న ఈసీ నిర్ణయాన్ని తప్పుబట్టలేం’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది.  

మరిన్ని వార్తలు